Full detail information about curd

Full detail information about curd

పెరుగు... 
పెరుగులో ఉప్పు కలుపుతున్నారా...? అయితే ఇది మీకోసమే. 
పెరుగు అనేది ప్రతి ఇంట్లో సర్వసాధారణంగా భోజనంలో ఉపయేగించేదే...  కొందరికైతే చివరిగా పెరుగన్నం తిననిదే భోజనం చేసిన తృప్తి కలుగదు. దీనిని ప్రతి ఒక్కరు ఇష్టపడతారు. మరి అలంటి పెరుగు గురించి మరియు దానిని ఆహారంగా ఏ విధముగా తీసుకోవాలో తెలుసుకుందాం.

          పెరుగులో లాక్టోబాసిల్లస్ (Lactobacillus) అనే పేరు గల మంచి బ్యాక్టీరియా ఉంటుంది. ఈ బ్యాక్టీరియా వలన శరీరంలోని ప్రేగుల్లో ఏర్పడే చెడు బ్యాక్టీరియాను సంహరిస్తుంది. కానీ ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే అన్నంతో గాని చపాతీతో గాని ఇంకా దేనితోనైనా కలిపి తీసుకుంటే ఈ ఫలితం ఉండదు. ఇది కేవలం ఉదయం ఖాళీ కడుపున తీసుకున్నప్పుడే ఈ ఫలితం ఉంటుంది, మరి అన్నంతో, చపాతీతో తీసుకోవడం తప్పా...? అంటే... తప్పే కాదు. పెరుగును అన్నంతోగాని, చపాతితోగాని, రైతాలా గాని తీసుకుంటే అది పోషకంగా పనిచేస్తుంది. కానీ ప్రేగుల్లోని చెడు  బ్యాక్టీరియాను చంపాలి అని అనుకుంటే మాత్రం ఉదయంపూట ఖాళీ కడుపున మొట్టమొదటి ఆహారంగా కేవలం పెరుగును మాత్రమే తీసుకోవాలి.

పెరుగును ఎప్పుడు తీసుకోవాలి ?

          పెరుగు యొక్క ధర్మం వేడి. పెరుగును గడ్డ పెరుగుగా తీసుకుంటే అది వేడి చేస్తుంది, అదే పెరుగును గడ్డగా కాకుండా చిలికినట్లు చేస్తే అది చలవ చేస్తుంది. ఇందులో కొన్ని నీళ్ళు కూడా కలుపుకోవచ్చు. నిత్యం గడ్డపెరుగు తీసుకొంటే శరీరం వేడెక్కి ఆకలి మందగిస్తుంది. పెరుగును అన్ని రోజులలో తీసుకోవచ్చును, ఒక వర్షాకాలంలో తప్ప. అనగా బాగా వర్షాలు పడుతూ ఎండ అసలే లేకుండా ఉండే రోజులలో పెరుగును తప్పించి మిగతా అన్ని రోజులలో ఆహారంగా తీసుకోవచ్చును. రోజు వర్షాలు తీవ్రంగా పడుతూ ఎండ అనేది లేకుండా ఉంటె అప్పుడు జలుబు, దగ్గు లాంటివి రావడానికి అవకాశాలు ఉంటాయి అందులోను పెరుగు కూడా కఫంను ప్రేరేపిస్తుంది, కావున ఆ రోజుల్లో మాత్రం తినకుండా మిగతా రోజులైనా ఎండాకాలం, చలికాలం హాయిగా తీసుకొనవచ్చును. ఇంకొక విషయము పెరుగును ఎప్పుడైనా సూర్యాస్తమయం అయిన తర్వాత తీసుకొనకూడదు, అది ఆరోగ్యవంతులయిన మరియు అనారోగ్యవంతులయిన. ఎందుకనగా రాత్రి సమయంలో పెరుగును తీసుకోవడం వలన కఫం పెరిగే అవకాశం ఉంది.  అంతేకాక అలా రోజు తీసుకోవడం వల్ల రాను రాను అది ఎలర్జీలకు, జలుబు, దగ్గు వంటి అనారోగ్యాలను కలిగిస్తుందని ఆయుర్వేద శాస్త్రం చెబుతుంది.

పెరుగులో ఏమి వేసుకోవాలి ?

          పెరుగులో దాదాపుగా అందరు ఉప్పు వేసుకొంటారు, మరికొందరు చెక్కర వేసుకుంటారు. మరి ఇందులో ఏది మంచిది? మీరు పెరుగులో ఉప్పు వేసుకున్నారా... అంతే..! ఇగ మీరు తిన్న పెరుగు వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదనే చెప్పాలి. ఆలా అయితే మరి పెరుగులో, మజ్జిగలో, లస్సిలో ఇంకా రైతాలో అయితే తప్పకుండా ఉప్పు వేయనిదే తీసుకోలేము అని అనుకుంటున్నారా...? ముందుగా ఎందుకు వేసుకోకూడదో తెలుసుకుందాం. పెరుగులో లాక్టోబాసిల్లస్ (Lactobacillus) అనే చెప్పబడే మంచి బ్యాక్టీరియా ఉంటుంది అని చెప్పుకున్నాం కదా... ఈ మంచి బ్యాక్టీరియా ఉప్పును పెరుగులో వేయగానే చనిపోతుంది. ఆ మంచి బ్యాక్టీరియా కోసమే పెరుగును తీసుకుంటాం... అలాంటప్పుడు ఆ మంచి బ్యాక్టీరియా చనిపోయాక ఆ పెరుగు తినడం వలన లాభం ఏమి ఉంటుంది. మరి అయితే ఏమి వేసుకోవాలి అనుకుంటున్నారా?

          పెరుగును ఎప్పుడు తీపి పదార్దాలతో తీసుకోవాలి. తీపి పదార్దాలు అంటే... శక్కర్, బెల్లం, మిశ్రి తో తీసుకోవాలి. తీపిగా తీసుకోలేము ఉప్పే వాడాలి అనుకొనే వారికోసం అయితే మీరు సముద్రపు ఉప్పు, అయోడిన్ ఉప్పు కాకుండా సైంధవలవణము (Rock Salt) ను వాడవచ్చును. తీపిగా తీసుకుంటాం... మేము ఇలానే తీసుకుంటున్నాం కూడా అని అనుకునే వారు ఇక్కడ ఒకటి గమనించాలి, మీరు రోజు వాడే చక్కర (Sugar) కాకుండా శక్కర్ (Natural Sugar Brown) ను వాడండి. ఇదేంటి అని అనుకుంటున్నారా? శక్కర్ కూడా మనం రోజు వాడే చక్కరలానే వుంటుంది కానీ అది కాదు. ముందుగా శక్కర్ గురించి తెలుసుకుందాం.

          శక్కర్ కూడా చెరుకు రసం నుండే వస్తుంది కానీ ఇది బెల్లం కంటే ముందుగా వచ్చే పదార్థం. చెరుకు రసం ను మరిగించగా మొదటగా శక్కర్ వచ్చే స్థితి వస్తుంది, అలానే ఇంకా మరిగించగా బెల్లం వస్తుంది. చెరుకు రసం నుండి బెల్లంగా మారే స్థితికి సరిగ్గా మధ్యలో ఈ శక్కర్ వస్తుంది. కావున శక్కర్ కి బెల్లం లక్షణాలే ఉంటాయి కానీ బెల్లం వేడి చేస్తుంది, శక్కర్ చలవ చేస్తుంది. ఎందుకనగా చెరుకు రసం ను వేడి చేయగా చేయగా బెల్లంగా మారుతుంది, ఇలా వేడి చేయడం వలన బెల్లం కు వేడి చేసే గుణం ఉంటుంది, కానీ అదే శక్కర్ తయారవ్వడానికి బెల్లం అంత సమయం మరిగించనవసరం లేదు కావున శక్కర్ కు బెల్లం చేసేంత వేడి గుణం ఉండదు, చెరుకు లా చలవ చేసే గుణం కలిగిఉంటుంది. ఇగ చెక్కర గురించి వస్తే బెల్లం స్థితి దాటి ఇంకా ఎన్నో కెమికల్స్ తో కలిపి శుద్ధి చేయగా చిట్టచివరిగా వచ్చే పదార్థం, కావున ఇది అంతగా మంచిది కాదు. అందులోను చెక్కర ను తీసుకోవడం వల్ల ఇది కడుపులో ఆసిడ్స్ గా మారుతుంది. దీన్ని అరిగించడానికి ఇంకా ఎక్కువ శక్తి కావాల్సివస్తుంది. అదే శక్కర్, బెల్లం అయితే క్షార గుణం కలిగింది కావున కడుపులోని ఆహారాన్ని అరిగించడానికి ఉపయోగపడుతుంది. కావున శక్కర్ ను ప్రతి ఒక్కరు తీసుకొనవచ్చును. ఇది బెల్లం మాదిరిగా ముదురు రంగులోనే ఉంటుంది. బెల్లం కలుపుకోవచ్చు అన్నారు కదా అని పెరుగులో బెల్లం వేసుకోకండి, బెల్లం వేసుకోవాలంటే పెరుగులో కొన్ని నీళ్లు కలుపుకోవాలి, ఎందుకనగా బెల్లం వేడి చేసే గుణం కలది అని చెప్పుకున్నాం కదా... అలాగే పెరుగు కూడా వేడి చేసే గుణం కలది కావున బెల్లం కలపాలంటే మజ్జిగగా మాత్రమే తీసుకోవాలి. పెరుగులో మాత్రం శక్కర్ వేసుకోండి చలవచేస్తుంది.

పెరుగు యొక్క విరుద్ధ పదార్దాలు...

          పెరుగును అన్నంతో గాని, చపాతీ, రొట్టెలతో గాని తీసుకొనవచ్చును కానీ పప్పు దినుసులతో చేసిన వంటకాలతో తీసుకొనగూడదు. ఎందుకనగా పప్పు దినుసులు మరియు పెరుగు ఇవి రెండు ప్రోటీన్లు ఇచ్చే పదార్దాలు కావున వీటిని కలిపి తీసుకోకూడదు. ఒకవేళ తీసుకోవాల్సి వస్తే పెరుగును కొద్దిగా వేడిచేసి తీసుకోవచ్చును లేదా ఆ పెరుగులో తాలింపు వేసుకొని తీసుకోవచ్చును, కానీ అదే మినపప్పుతో మాత్రం పెరుగును మొత్తానికే తీసుకోకూడదు. ఒకవేళ మినపప్పుతో పెరుగును తీసుకుంటే అది మీ B.P. (Blood Pressure) ని పెంచుతుంది, కావున మినపప్పుతో పెరుగును మాత్రం ఒక్కసారి కాదుకదా మొత్తానికే తీసుకొనకూడదు, మిగతా పప్పులతో మాత్రం పైన చెప్పినట్టు ఎప్పుడైనా ఒకసారి తీసుకొనవచ్చును.

          పెరుగుతో రైతాను చేసినప్పుడు అందులో టమాట, ఉల్లిపాయలు, ఆకుకూరలతో కలిపి రైతాను చేసుకోవచ్చును, కానీ ఖీర ను మాత్రం కలుపకూడదు. ఖీరాతో చేసిన రైతాను తీసుకోవడం వల్ల ఆనారోగ్యాలు కలుగుతాయని వాగ్భాటాచార్యులు తెలిపారు.

          నెయ్యి మరియు పెరుగును, అలాగే పాలతో పెరుగును కలిపిన వాటిని తీసుకోకూడదు.

ఏ ఏ సందర్భాల్లో పెరుగును ఏవిధంగా తీసుకోవాలి ?

శరీరం వేడిగా ఉన్నప్పుడు, ఎసిడిటి, లివర్ వేడిగా ఉన్నప్పుడు పెరుగులో శక్కర్ వేసుకొని తీసుకోండి శరీరాన్ని చల్లబరుస్తుంది.
శరీరంలో గ్యాసు, నొప్పులు, వాయు సమస్యలు ఉంటె మాత్రం సైంధవలవణము (Rock Salt), జీర వేసుకొని తీసుకొనవచ్చును.
మీకు కఫం ఉంది కానీ పెరుగును తీసుకోవాలనుకుంటే మాత్రం అందులో సైంధవలవణము (Rock Salt), మిర్యాలు, కొద్దిగా దాల్చిన వేసుకొని తీసుకొనవచ్చును.
 పెరుగు వాతనాశకం అనగా పెరుగు తీసుకుంటే వాయుకు సంబందించిన రోగాలను నాశనం చేస్తుంది, దాంతో పాటు పిత్తం మరియు కఫం ను పెంచుతుంది. ఎప్పుడైనా పుల్లటి పెరుగు తీసుకుంటే పిత్తాన్ని, కఫాన్ని మరింత పెంచుతుంది. పుల్లటివి ఏదైనా ఎప్పుడైనా పిత్తాన్ని పెంచుతుంది. పిత్తం పెరిగినప్పుడు చర్మ సమస్యలు, ఎలర్జీలు రావడం మొదలవుతాయి. ఒక్కొక్కసారి పిత్తం, వాయుతో, కఫంతో కలిసినప్పుడు ఎగ్జిమా వంటి సమస్యలు కూడా మొదలవుతాయి. పిత్తం, వాయుతో కలిస్తే పొడి ఎగ్జిమా, అదే పిత్తం, కఫంతో కలిస్తే నీరుకారే ఎగ్జిమా లాంటి సమస్యలకు దారితీస్తాయి.

చర్మ సమస్యలు ఉన్నప్పుడు పుల్లటి పెరుగును తీసుకోకూడదు. ఎందుకనగా పుల్లని పెరుగు మరింత వేడి చేస్తుంది. ఈ వేడి వల్ల పిత్తాన్ని పెంచుతుంది. తియ్యటి పెరుగును తీసుకొనవచ్చును. అనగా... శక్కర్ వేసుకొంటే తియ్యగా అవుతుంది కదా... అని అనుకుంటున్నారా? అలా కాదు. పెరుగు అనేది ఎక్కువ సేపు నిలువలేనిది, తాజాది మరియు స్వాభావికంగా తియ్యగా ఉండాలి.

ఇంకొక విషయం ఫ్రిజ్ లో పెట్టనిది అయిఉండాలి. ఎందుకంటే ఫ్రిజ్ లో పెట్టినమంటే దానికి వేడి చేసే గుణం వస్తుంది. పెరుగు ఒక్కటే కాదు ఏ పదార్థం అయినా ఫ్రిజ్ లో పెట్టినమంటే దానికి వేడి చేసే గుణం వస్తుంది. వేడి చేసే గుణం కలిగిన పదార్థం తో పిత్తం పెరుగుతుంది. పిత్తం పెరుగుతే చర్మ సమస్యలు పెరుగుతాయి.

పూర్తిగా పెరుగు కానిది అనగా సగం అయ్యి సగం కానీ పెరుగును మొత్తానికే తీసుకోకూడదు చర్మ సమస్యలు ఉన్నవారు.

పెరుగు పైన వచ్చే నీళ్లను కూడా తీసుకోండి. ఈ నీళ్లు పొట్టను శుభ్రపరుస్తుంది.

చర్మ సమస్యలు ఉన్నవాళ్లు పెరుగులో నీళ్లను కలుపుకోండి అనగా పెరుగుకు నాల్గవవంతు నీళ్లు కలుపుకొని తీసుకోండి.  అందులో శక్కర్ వేసుకోండి, కానీ బెల్లం వద్దు. పెరుగులో శక్కర్ వేసుకోవచ్చును, అదే పెరుగులో నీళ్లు కలుపుతే అందులో బెల్లం ఉపయోగకారిణిగా అవుతుంది, కానీ చర్మ సమస్యలు ఉన్నవాళ్లు బెల్లం అంతగా తీసుకోకూడదు. ఎందుకంటే వేడిని పెంచుతుంది, కావున చర్మ సమస్యలు ఉన్నవాళ్లు కొద్దిగా శక్కర్ వేసుకోండి. మిగతావాళ్ళు మాత్రం బెల్లం వేసుకొనవచ్చును.

మూత్రపు సమస్యలు, ఆగి ఆగి మూత్రం వచ్చే వాళ్ళు పెరుగును చిలికి నీళ్లు జోడించి బెల్లంతో తీసుకొంటే వారికీ ఉపయోగకారిణిగా ఉంటుంది.

పెరుగుతో అరటిపండు రోజు తినడం మంచిదికాదు, అప్పుడప్పుడు పర్వాలేదు...  కానీ ఎవరికైతే మలం ఆగకుండా చాలాసార్లు కడుపును ఖాళీ చేస్తుండేవారు, తినగానే ఒత్తిడి పెరిగి మలం పోవడం లాంటివి చేసేవాళ్లకు మాత్రం పెరుగులో అరటిపండు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

పెరుగు మలబద్దకం, డైహేరియ , మొలలు మరియు పేగులకు సంబందించిన కేన్సర్ వంటి ఇంకా ఎన్నో ఆనారోగ్యాలనుంచి కాపాడుతుంది. ఇంకా పెరుగు రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

మరి అలాంటి పెరుగులో ఏ ఏ విటమిన్లు ఉంటాయో చూద్దాం... 

సామాన్యంగా పిల్లలకి పాలు త్రాగిస్తాము. ఎందుకనగా ఇందులోని కాల్షియమ్ పిల్లల ఎదుగుదలకు తోడ్పడుతుంది. ఇందులో కాల్షియమ్ ఉంది కదా అని పెద్దవాళ్ళు కూడా పాలను సేవిస్తుంటారు, ఇక్కడ ఒక విషయం గమనించాలి.  పాలల్లో లాక్టోస్ అనే పదార్థం ఉంటుంది. దీనిని జీర్ణించుకునే శక్తి మాత్రం పిల్లలలోనే ఉంటుంది. అనగా పాలల్లోని లాక్టోస్ ను జీర్ణింపజేసే ఎంజైమ్ వయస్సు పెరుగుతున్నకొద్దీ తగ్గుతూ వస్తూ ఉంటుంది. అలా పాలు జీర్ణం కావు. కానీ కాల్షియమ్ ఇంకా ఎన్నో పోషకాలు ఉన్నాయని పెద్ద వాళ్ళు కూడా త్రాగుతుంటారు, కొందరైతే బలవంతంగా త్రాగుతారు కాల్షియమ్ కోసమని కానీ వాళ్ళు తెలుసుకోరు ఇవి అరగవని. పాలు ఎవ్వరో ఒకరికి మాత్రమే జీర్ణం అయ్యే శక్తి ఉంటుంది కానీ అందరికి కాదు. మరి అలా అయితే కాల్షియమ్ ఎలా పొందాలి? అని అనుకుంటున్నారా...  అందుకు ఈ పెరుగు ఎంతో ఉపయోగపడుతుంది. పెరుగు లో ఎంతో కాల్షియమ్ ఉంది. పాలే జీర్ణం కానప్పుడు, ఆ పాలతోనే పెరుగు తయారవుతుంది కదా ఇది ఎలా జీర్ణం అవుతుంది అనుకుంటున్నారా?

          మనం పెరుగు ను తయారుచేయడానికి పాలల్లో కొద్దిగా పెరుగును తోడుగా వేస్తాము, అప్పుడు పాలల్లోని లాక్టోస్ అనే చెక్కరని  లాక్టిక్ ఆసిడ్స్ గా మారుస్తాయి, దాంతో పాలల్లోని ఆమ్లశాతం తగ్గుతుంది మరియు పాలల్లోని ప్రోటీన్లు అమైన్ ఆసిడ్ క్రింద మారి ఆ తర్వాత గడ్డకడుతుంది. ఈ అమైన్ ఆసిడ్ లు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి కావున పెరుగు ఎంతో శ్రేయస్కరం.

          పెరుగులో A, B2, B6, C, E వంటి విటమినులు మరియు కాల్షియమ్, సోడియం, మెగ్నీషియం, ఫాస్పరస్, ఐరన్, జింక్ లాంటి ఖనిజాలు ఇంకా ఆమ్లాలు ఉంటాయి. పెరుగులోని కాల్షియమ్ శరీరానికి పడుతుంది. D విటమిన్ తయారీకి తోడ్పడుతుంది.

 చివరిగా ఒక విషయం.... 
          పాలు మాకు జీర్ణం అవుతున్నాయి మేము పాలు కూడా తీసుకుంటాము అని అనుకునే వాళ్ళు మీరు పాలను మాత్రం రాత్రి సమయంలో తీసుకోండి, పగలు పాలు త్రాగకండి. పెరుగును మాత్రం పగలు వాడండి, సూర్యాస్తమయం అయిన తర్వాత మాత్రం పెరుగును వాడకండి.

          పెరుగుకు సంబందించిన విషయాలు తెలుసుకున్నారు కదా... హాయిగా పెరుగును పైన చెప్పిన విధానాల్లో మీకు నచ్చినట్లుగా తీసుకోండి, ఆరోగ్యంగా ఉండండి, అందరికి మేలు కలుగుగాక.... శుభం కలుగుగాక...





భవతు సర్వ మంగళం




కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి