తలవెంట్రుకల జీవితకాలం ఎంతో తెలుసా...?


మానవ పరిణామంలోకి మార్పు చెందిన తర్వాత దాదాపు కొన్ని లక్షల సంవత్సరాల దాక మానవుడు ఒంటిమీద బట్టనేది లేకుండా మిగతా జంతువుల్లాగా నగ్నంగానే తిరిగాడు, అప్పట్లో అతనికి శరీరం నిండా దట్టంగా వెంట్రుకలు ఉండేవి. కాలక్రమేణా అవికాస్తా రాలిపోయి మానవ చర్మం మృదువుగా తయారయింది. ఒక్క తలమీద వెంట్రుకలు తప్ప ఒత్తుగా, పొడుగ్గా, మిగతా జీవులకు భిన్నంగా...  తలమీది వెంట్రుకలు మనిషిని మిగతా జీవులనుండి వేరుచేసి 'వీడు మనీషీ ' అని చెప్పటానికి సూచనగా ఉండేవి. సృష్టిలో మరే ఇతర జీవికి మనకున్నట్లుగా తల మీద ఇంత పొడుగాటి వెంట్రుకలు లేవు.
          మన పూర్వీకుడైన ఆదిమానవుడికి కేశాలంకరణ కోసం ఇప్పుడు మనకున్నట్లుగా దువ్వెనలు, బ్రష్ లు, కత్తెరలు లాంటివి ఉండేవికావు. మానవుడు అభివృద్ధి చెందుతూ సంస్కృతీ, సాంప్రదాయాలను అలవర్చుకునే దశకు వచ్చేసరికి తలమీద వెంట్రుకలలో కూడా మార్పు చోటు చేసుకుంది. దుస్తుల్ని ధరించి అలంకరణను అలవర్చుకునే నాటికీ స్త్రీల వెంట్రుకలు పొడువుగానూ పురుషుల వెంట్రుకలు పొట్టిగానూ ఉండటం ఫ్యాషన్ అయ్యింది, అంతే తప్పా స్త్రీకి పొడవుగా పెరిగే లక్షణం మరియు పురుషులకు తక్కువ పెరిగే లక్షణం అంటూ ఏమి లేదు. శరీర ధర్మరీత్యా వెంట్రుకల పెరుగుదల స్త్రీ, పురుషులిరువురిలోను ఒకే రకంగా ఉంటుంది.
          తలవెంట్రుకల పెరుగుదల ఇరువురిలో ఒకే రకంగా ఉన్నప్పటికీ, పురుషులకు మాత్రమే బట్టతల కనబడుతుంది. ఆడవారిలో బట్టతల కలవాళ్ళను మనం చూడలేము, కానీ వాళ్ళలో చాలామందికి వయస్సు పైబడే సరికి వెంట్రుకలు పలచబడటం మాత్రమే కనిపిస్తుంది. ఇందుకు గల కారణం ఏమి అనగా... ఆండ్రోజన్ అనబడే పురుషహార్మోన్ల అతి ఉత్పత్తి బట్టతలకు ముఖ్యకారణంగా చెప్పబడుతుంది.
          బాల్యంలో ఎవరికీ బట్టతల రాదు. యవ్వనం వచ్చాక కొందరి పురుషుల్లో పురుష హార్మోనుల ఉత్పత్తి ఉధృతమై, వెంట్రుకల కుదుళ్ళను పనిచేయనీయకుండ స్తంభింపచేస్తుంది. ఇలా స్తంభింపచేయడం అనేది నెత్తి పైభాగాన ఎక్కువగా జరుగుతుంది. కావున నెత్తి పైభాగాన ఉండే వెంట్రుక పెరగకుండా ఉండి అది కాస్తా రాలిపోయి మరో వెంట్రుకంటూ పెరగక ఆ భాగం నున్నగా తయారై నిగనిగలాడే బట్టతలాగా ఏర్పడుతుంది.
          కొజ్జాలలో బట్టతల కల్గిన వాళ్ళెవరూ కనిపించరు. ఎందుకనగా యవ్వనాoకురం జరగబోయే సమయానికి వారిని కొజ్జాగా మారుస్తారు, అందువల్ల వారిలో సెక్స్ హార్మోనుల ఉత్పత్తి కావడం జరగదు. ఒక్కరూ అరా ఎవరన్నా అలా కనిపించారంటే వాళ్ళు బాల్యంలో కాకుండా చాలా తర్వాత కొజ్జాలుగా మార్చబడిన వాళ్ళై ఉంటారు.
          బట్టతల రాకుండా ఉండాలంటే వారసత్వంగా పూర్వీకులెవరూ బట్టతల లేనివాళ్ళ కుటుంబంలో జన్మించగలగాలి, అది మన చేతిలో లేని పని.
          శత్రువులను చూసినప్పుడు కోపంతోగాని భయంతోగాని జంతువులకు తలమీద వెంట్రుకలు నిక్కబొడుచుకుంటాయి, కానీ మనిషికి అలా నిక్కబొడుచుకోవు. ఇందుకుగల కారణాలలో ఒకటి ఏమిటంటే మనిషి యొక్క వెంట్రుకలు పొడవుగానూ, బరువుగానూ ఉండటం.
          వెంట్రుక కుదురు రంద్రంలో సెబాసియస్ అనే చిన్న చిన్న గ్రంధులు ఉంటాయి, ఈ చిన్న చిన్న గ్రంధులు సెబమ్ అని పిలవబడే నూనె పదార్దాన్ని విడుదల చేస్తాయి. ఈ నూనె పదార్ధం వల్లనే వెంట్రుకలు మృదువుగా మెత్తగా ఉండటానికి పనికివస్తుంది. సెబాసియస్ గ్రంధులు అతిగా నూనె పదార్ధాన్ని తయారుచేస్తే ఆ వ్యక్తి వెంట్రుకలు మృదువుగా మెత్తగా ఉంటాయి, తక్కువగా తయారుచేస్తే పొడిగా గరుకుగా ఉంటాయి.
          వెంట్రుకలకు పట్టిన దుమ్ము, మట్టిని వదిలించుకోవడానికి మనం తలస్నానం చేస్తుంటాము. ఇది అవసరమే అయినా అతిగా తలస్నానాలు చేయటం మూలంగా వెంట్రుకలొ ఉండే సెబమ్ పోయి నష్టం కలిగే అవకాశం ఉంది. అలాగే అసలు తలస్నానం చేయకపోవటం కూడా నష్టాన్నే కలుగచేస్తుంది.
          ప్రపంచవ్యాప్తంగా మూడు రకాల వెంట్రుకలు గుర్తించబడ్డాయి. ఉంగరాలు తిరిగి ఒత్తుగా గుబురుగా ఉండే వెంట్రుకలు, పైకి కిందికి వంపులు తిరుగుతూ కెరటాల్లా ఉండే వెంట్రుకలు, సాఫీగా ఉండే వెంట్రుకలు. వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ మూడు రకాల వెంట్రుకలు ఏర్పడ్డాయన్న ఒక సిద్ధాంతం ఉంది.
          తలవెంట్రుకలతో మన బాడీ లాంగ్వేజ్ కూడా తెలుసుకోవచ్చు అట...!
          అది ఎలా అనగా, మనకు ఇష్టమైన వాళ్ళుగాని, అందమైన వాళ్ళుగాని ఎదురైనప్పుడు స్త్రీ, పురుషులు అరచేతితో జుట్టును సవరించుకోవటాన్ని చూస్తుంటాము, 'నీ దృష్టిలో నేను అందంగా కనిపంచాలనే' భావనకు సూచన అది. అంతేకాదు, అవతలి వాళ్లకు తన ఇష్టాన్ని సూచించే ఆహ్వానం కూడా. ఆత్మీయులు చనిపోయినప్పుడు కొందరు తమ జుట్టును పీక్కుంటూ ఏడుస్తారు.
          మనకు ఆయిష్టమైనవాళ్లు, అపరిచుతులు ఎవరైనా మన నెత్తి మీద చేయి వేస్తె మనకు కోపము, చిరాకు కలుగుతాయి, అదే మనకు ఇష్టమైన వాళ్ళు చేయి వేస్తె అది ప్రేమకు సూచనగా, మెచ్చుకోలుగా భావిస్తాము. ప్రేయసి ప్రియులు కూడా ఒకరి జుట్టును ఒకళ్ళు ప్రేమతో సవరిస్తారు, చెరిపేస్తారు, ముద్దు పెట్టుకుంటారు. ఇది వారు తమ ప్రేమను తెలుపుకోవటంగా భావిస్తారు.
          పొడుగాటి జుట్టు మృదువుగా పట్టులా ఉండి ఎదుటివాళ్లలో చెడు ఆలోచనలను కలింగించే విధంగా ఉంటుంది. కావున హిందూ సాంప్రదాయంలో స్త్రీలు జడ వేసుకోవటం ద్వారా తమ జుట్టు అందం పరాయి వాళ్లకు చెడు ఆలోచనలు కలగకుండా ఉండేటట్లు చూస్తారు, అంతేకాక తమ చీర యొక్క కొంగు తో కప్పుకుంటారు. ముస్లిం స్త్రీలు తలకు బురఖా ధరించటానికి ఇది ఒక కారణం కూడా. అలాగే కొన్ని దేశాల స్త్రీలు తమ జుట్టును కనిపించకుండా దాచుకోవడానికి తలకు వలలాంటి వస్త్రాన్ని కట్టుకుంటారు.
          వెంట్రుకలను పొట్టిగా కత్తిరించటం పురుష చిహ్నంగానూ, పొడవుగా ఉంచేయటం స్త్రీ చిహ్నంగానూ నేడు సమాజంలో స్త్రీ పురుష లక్షణాలకు సూచకంగా ఉపయోగపడుతుంది. కానీ అదే మన పూర్వీకులైన ఋషులను, గురువులను, పండితులను, విద్వాంసులను, రాజులను, ప్రజలను పరిశీలిస్తే స్త్రీ పురుషుల తేడా లేకుండా అందరికి పొడవుగా ఉండేవి.
          పొట్టిగా కత్తిరించుకున్న వెంట్రుకలు మొరటుదనానికి సూచనగా కనిపిస్తాయి. మిలటరీ వాళ్ళ జుట్టు చూడండి, ఆ జుట్టుతో వాళ్ళెంత మొరటుగా కనిపిస్తారో!  పొట్టి జుట్టు ద్వారా పురుషులు తమ మొరటుదనాన్ని పొడుగాటి జుట్టు ద్వారా స్త్రీలు తమ మృదుత్వాన్ని చాటుతుంటారు.
          వెంట్రుకలనేవి స్త్రీ పురుషులిరువురికి తలమీద, జననేంద్రియాల వద్దా, బాహు మూలాల్లోను ఉంటాయి. కానీ పురుషులకు మాత్రం యవ్వనం వచ్చాక ఛాతి మీద మొలుస్తాయి, అంతేకాక గడ్డం మీసం కూడా మొలుస్తాయి. అనగా శరీరం మీది వెంట్రుకలు, గడ్డం, మూతి మీది మీసం కూడా పురుష లక్షణానికి సూచనలు, అలాగే  పురుషత్వానికి ప్రతీకగా నిలుస్తుంటాయి. ఎవరినన్నా అవమానించాలంటే పూర్వం అతనికి నెత్తి కొరిగించి, మీసం, గడ్డం తీసేవాళ్ళు. అది అతడి పురుషత్వాన్ని పరిహసించటం, కించపరడం కిందికి వస్తుంది.
          మనం పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు గుండు గొరిగించుకుంటాం, అది భగవంతుడి ముందు మనల్ని అర్పించుకోవటం. ఎలా అనగా వెంట్రుకల్ని మనం అందంగా కత్తిరించుకుంటాము, రంగు వేయించుకుంటాము, తలపాగా చుడుతాము, టోపీ ధరిస్తాము, స్త్రీలయితే మెలితిప్పి జడలు వేసుకుంటారు, సిగ చుడతారు, పూలు పెట్టుకుంటారు. ఈ రకంగా పురుషుడుగానీ స్త్రిగానీ తలవెంట్రుకలకు ఎంతో ప్రాధాన్యతనిచ్చి అలంకరణ చేసుకుంటారు. అందాన్ని ఇనుమడింప జేసుకునే ప్రయత్నంలో మానవుడికి తలవెంట్రుకలు ముఖ్యసాధనంగా ఉంటాయి. ఇంత ప్రాధాన్యత కలిగిన వెంట్రుకలతో మనకు అందం, అహం తోడవుతుంది. అలా మానవుడు నేను ఇది నేను అది అని ఒక గిరి గీసుకొని జీవిస్తుంటారు, అలా ఈ విదంగా గుండు గొరిగించుకొని ఆ బందంను వదులుతున్నానని, అంటే మన అల్పత్వాన్ని అంగీకరిస్తూ ఆయన ఔన్నత్యాన్ని ఒప్పుకోవటం. బౌద్ధ భిక్షువులు, నన్యాసదీక్ష పుచ్చుకున్నవారు గుండు గొరిగించుకుని నున్నటి గుళ్ళతో ఉండటానికి కూడా ఇదే కారణం.
          తలవెంట్రుకల శక్తిని చూస్తే ఆశ్చర్యమేస్తుంది. ఆరోగ్యంగా ఉండే మనిషి జుట్టు పట్టుకుని పైకి లేవెనెత్తినా లేక ఈడ్చినా అవి తెగకుండా ఉండే అవకాశం ఉంది. చైనా సర్కస్ క్రీడాకారులు కొందరు తలవెంట్రుకల ఆధారం మీద ఉయ్యాల లుగటంలో ప్రసిద్ధులు. వెంట్రుకలకు సాగే గుణం కూడా ఉంది. తెగేదాకా వెంట్రుకను లాగితే అది 20 నుంచి 30 శాతం దాక పొడవుకు సాగవచ్చు.
          ప్రతి మనిషి తలమీద సుమారున లక్ష వెంట్రుకలు ఉంటాయి. ఏ కారణంవల్లో తెలియదుగాని వెంట్రుకల సంఖ్య ఆయా వ్యక్తుల శరీర రంగును బట్టి మారుతుంది. తెల్లగా ఉండేవాళ్ల తలమీద నల్లగా ఉండేవాళ్ల నెత్తిమీద కంటే ఎక్కువ వెంట్రుకలుంటాయి. బంగారు రంగు జుత్తు కలవాళ్ళకు తలమీద 1,40,000 వెంట్రుకలుంటే గోధుమ రంగు వెంట్రుకల వాళ్లకు 1,08,000 ఉంటాయి. ఎర్రటి వెంట్రుకల వాళ్లకు 90,000 దాక ఉండవచ్చు.
          మన తలమీద ప్రతి వెంట్రుకా ఫాలిసిల్ అనబడే చర్మపు సంచిలోంచి పుట్టుకు వస్తుంది. ఆ సంచి అడుగున పాపిలా అనబడే కుదురు ఉంటుంది. అనేకానేక రక్తనాళాల ద్వారా ఈ కుదురుకు వెంట్రుక తయారీకి అవసరమైన ముడిపదార్ధాలు సరఫరా చేయబడతాయి. అవి అక్కడ కేశకణాల కింద మార్చబడతాయి. ఈ కేశ కణజాలం కుదురు నుంచి పాత కణాన్ని నెడుతూ పైకి పొడుచుకురావడం ప్రారంభిస్తాయి. చర్మం కింద ఉండే కుదురులోంచి పొడుచుకువచ్చే ఈ కణజాలం చర్మపు సంచిలోంచి బయటికి వచ్చేసరికి గట్టిపడుతుంది. మనకు బయటికి కనిపించే వెంట్రుక ఇదే. ఈ వెంట్రుక రోజుకు మిల్లీమీటరులో మూడోవంతు చొప్పున పెరుగుతుంటుంది.
          ఏ వ్యక్తికీ కానీ ఒక వెంట్రుక జీవితకాలం దాదాపుగా 6 సంవత్సరాలు. అంటే మంచి ఆరోగ్యంగా ఉన్న యువకుడి వెంట్రుకను కత్తిరించకుండా అలా ఉంచేస్తే రాలిపోబోయే సమయానికి అది 42 అంగుళాల పొడుగు ఉంటుందన్నమాట. దీని అర్ధం ఉంగరాలు తిరగని సాఫి వెంట్రుకలు కల యువతి యువకుల తల వెంట్రుకలను కత్తిరించకుండా అలా వదిలేస్తే అవి వాళ్ళ వీపు వెనుక మోకాళ్ళ దాకా వస్తాయని చెప్పుకోవచ్చు.
          ఏ క్షణంలోగాని ఏ వ్యక్తికయినా గాని తలమీద వెంట్రుకలలో 90 శాతం ఎదుగుతూ ఉంటే 10 శాతం ఎదుగుదల లేకుండా అలా పడి ఉంటాయి. ఈ ఎదుగుదల లేకుండా పడి ఉండటమనేది సుమారుగా 3 నెలల పాటు ఉండి ఆ తర్వాత ఆ వెంట్రుకలు రాలిపోతాయి. వెంట్రుక రాలిపోవటమంటే అది కుదురు నుండి పట్టును కోల్పోవటం. కుదురు నుంచి ఒక వెంట్రుక ఊడిపోగానే ఆ వెంటనే మరో వెంట్రుకకు అంకురార్పణ జరిగి అది మల్లి మరో ఆరు సంవత్సరాలపాటు ఎదుగుతూ వస్తుంది. ఆ ఆరు సంవత్సరాలు కాగానే అంతకుముందు వెంట్రుకలాగే అది కూడా ఎదుగుదలను కోల్పోయి మూడునెలలపాటు నిశ్చేతనంగా ఉండి ఆ తర్వాత రాలిపోతుంది. ప్రస్తుత మన ఆయుః ప్రమాణాన్ని బట్టి చెప్పాలంటే ప్రతి వెంట్రుక కుదురునుంచి దాదాపుగా 12 సార్లు వెంట్రుకలు మొలుస్తాయి. లక్షల్లో ఎవరొకొందరికి మాత్రమే ఈ లెక్క అటుఇటుగా ఉండి వెంట్రుక నిరంతరాయంగా అలా ఎదుగుతువుంటుంది, లేక వెంట్రుక జీవితకాలం 6 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండి అందరికంటే ఎక్కువ పొడుగు పెరుగుతాయి.


భవతు సర్వ మంగళం
         
          

కామెంట్‌లు