Swadeshi Udhyamam - 2

ఈ స్వదేశీ ఉద్యమం -2 అనేది ఇంతకూ ముందు ఉన్న గణపతి ఉత్సవాల వెనుక అసలు రహస్యం / స్వదేశీ ఉద్యమ-1 అనే శీర్షికకు తరువాతి శీర్షిక.




 లోకమాన్య బాలగంగాధర్ తిలక్ గారు 1893 వ సంవత్సరం నుండి ఊరూరూ తిరిగి ప్రజలందరిలో ధైర్యం నింపే ప్రసంగాలు ఇస్తూ, గణపతి ఉత్సవాల మండళ్లను స్థాపించి, లెక్కకు మించిన కార్యకర్తలను సృష్టించారు. ఇదంతా 1900 వ సంవత్సరానికి విస్తృతరూపం దాల్చింది. 1905 వ సంవత్సరంలో లార్డ్ ఖర్జన్ అనే బ్రిటిష్ అధికారి బెంగాల్ ను విభజించాడు. అప్పుడు దేశమంతటిలో తీవ్రంగా ప్రతిఘటించిన వ్యక్తి లోకమాన్య బాల గంగాధర్ తిలక్ గారు. వీరు ఆంగ్లేయులు చేసిన ఈ కార్యానికి చాలా ఖటువుగా స్పందించారు. తిలక్ గారు కేసరి అనే పేరుతొ పత్రికను నడుపుతుండేవారు. ఆ కేసరి పత్రికలో బెంగాల్ విభజనను తీవ్రంగా ప్రతిఘటిస్తూ సంపాదకీయాన్ని వ్రాసారు. అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం ఆ పత్రిక యొక్క ప్రతులన్నీ ప్రజలకు చేరకముందే స్వాధీనం చేసుకొని వాటిని తగలబెట్టింది. తిలక్ గారి ప్రతిస్పందన ప్రజలకు చేరకుండా ఉండడానికి. దీనితో తిలక్ గారు భావించారు, ఇక ఆలస్యం చేయవద్దు బ్రిటిష్ వారిపై ఉద్యమం మొదలుపెట్టాల్సిందే అని. నా ఈ ప్రతిస్పందన ప్రజలకు చేరకుండా ఉండేందుకు కేసరి పత్రిక ప్రతులను తగలబెట్టారు కదా అని వారు వివిధ గ్రామాల్లో ఏర్పాటుచేసిన గణపతి మండళ్లకు ఉత్తరాలు రాయడం మొదలుపెట్టారు. గ్రామ ప్రజలని ఒక చోట సంఘటిత పరచి ఉత్తరం ను చదివి వినిపించమని గణపతి మండళ్ల అధ్యక్షులకు సూచించేవారు. ఇలా తిలక్ గారు ఉత్తరాలతో బ్రిటిష్ వారి అరాచకాలను వివరిస్తూ, ఎన్నో వాస్తవాలను ప్రజలకు తెలియజేస్తుండేవారు.
          ఇలా బెంగాల్ విభజనపై తిలక్ గారు చేసిన ప్రతిఘటననే పంజాబుకు చెందిన లాల లజపతిరాయ్, బెంగాలులో బిపిన్ చంద్రపాల్ కూడా తీవ్రంగా వ్యక్తం చేసారు. దీనితో మండళ్ల అధ్యక్షులు, కార్యకర్తలు, నవయువకులు తిలక్ గారి వద్దకు వచ్చి ఆంగ్లేయుల ఈ అరాచకానికి మనం ఎలా బదులు ఇవ్వాలి అని అడిగారు. దానికి తిలక్ గారు ఇలా స్పందించారు, "ఇప్పుడు మన ముందున్న ఒకే ఒక కార్యం సంపూర్ణ స్వాతంత్ర్యం కోసం పోరాడటం, బ్రిటిష్ వాళ్ళను ఈ భారతదేశం నుండి పంపివేయడం. ఒక్క నిమిషం కూడా ఆంగ్లేయులను సహించే పరిస్థితి ఉండకూడదు". ఆ తరువాత ఒక సందర్భంలో వేదికపైన స్వాతంత్ర్యం నా జన్మ హక్కు అని నినదించారు. దీనితో ప్రజలందరూ ఆ నినాదంతో వారిని అనుసరించారు. స్వాతంత్ర్యం రావాలంటే ముందుగా మన దేశంలో స్వదేశీయత రావాలి, స్వదేశీయత రానంతవరకు స్వాతంత్ర్యం రాదు. స్వాతంత్ర్యం వస్తే స్వదేశీయత మరింత పెరుగుతుంది, అందుకు మనం స్వదేశీ ఉద్యమాన్ని ప్రారంభించాలి. దీనితోనే బ్రిటిష్ ప్రభుత్వం మన దేశాన్ని వదలివేళ్ళుతుంది అని తిలక్ గారు గణపతి మండళ్ల కార్యకర్తలకు ఉద్భోదించారు. ఇలా  గణపతి మండళ్ల కార్యకర్తలతో స్వదేశీ ఉద్యమం 1905 వ సంవత్సరం లో ప్రారంభమై విసృతరూపం దాల్చింది.
          తిలక్ గారు సూచించినట్లుగా గణపతి మండళ్ల కార్యకర్తలు వారి గ్రామాల్లోని ప్రతి ఇంటికి వెళ్ళి వారితో ఆంగ్లేయుల యొక్క ఈస్టిండియా మరియు ఇతర కంపెనీల వస్తువులను, వస్త్రాలను బహిష్కరించండి అని చెప్పడం మొదలుపెట్టారు. ఇలా క్రమక్రమంగా స్వదేశీ ఉద్యమం వ్యాపించసాగింది. తిలక్ గారి స్వదేశీ ఉద్యమ పిలుపుతో ప్రజలు చెక్కరను తినడం, కొనుగోలు చేయడం ఆపివేసినారు. ఎందుకంటే ఆ కాలంలో చెక్కర ఇంగ్లాండులో తయారై భారతదేశానికి వస్తుండేది. చివరికి మిఠాయిలు తయారుచేసేవారు మిఠాయిలు తయారుచేయడం ఆపివేసినారు. తమ జీవనోపాధి అయిన మిఠాయిలు తయారు చేసే వ్యాపారమును మూసివేసుకున్నారే కానీ చెక్కరను ఉపయోగించలేదు. కొందరు చెక్కరను ఉపయోగించకుండా మన దేశంలో తయారైన బెల్లం, పటిక బెల్లం వాటితో మిఠాయిలు తయారు చేయటం మొదలుపెట్టారు. ఇలా ఈ స్వదేశీ ఉద్యమం గ్రామ గ్రామాల్లోకి వ్యాపించింది.
          మనం గడ్డం గీసుకుని బ్లెడ్ కూడా ఆ కాలంలో ఇంగ్లాండులో తయారయ్యేది. మన భారతదేశంలో బ్లెడ్ తయారయ్యే పరిశ్రమ ఒక్కటి కూడా లేదు. తిలక్ గారి స్వదేశీ ఉద్యమ పిలుపుతో గడ్డం గీసే వృత్తి కల్గిన వాళ్ళు ఆంగ్లేయుల బ్లెడ్ మేము బహిష్కరిస్తున్నామని వారి జీవనోపాధి అయినా ఆ పనిని వదిలివేశారు, వేరే ఇంకేదైనా పనిని చూసుకుందాం అని నిర్ణయం తీసుకున్నారు. అప్పుడు తిలక్ గారు మీ పనిని వదిలివేయడం కాదు, బ్లెడ్ స్థానంలో ప్రత్యామ్నాయంగా వేరొక దానిని తీసుకోని వస్తే మీ పనిని మీరు కొనసాగించవచ్చు అని సూచించారు. దానితో వారు బ్లెడ్ బదులుగా మన దేశంలోనే తయారైన స్థానిక పరికరాలతో పనిని సాగించారు. అలా చేయడం వలన చర్మం అక్కడక్కడ తెగి గాయం అయ్యేది, అయినా ప్రజలు స్వదేశీ ఉద్యమం కోసం ఆనందంగా భరించేవారే కానీ ఆంగ్లేయుల బ్లెడ్ ను మాత్రం ఉపయోగించలేదు.
          అలాగే ఆంగ్లేయుల వస్త్రాలను సేకరించి తగలబెడుతుండేవారు. ఇంకా ఇంగ్లాండు నుండి సబ్బులు, ఉప్పు భారతదేశానికి వస్తుండేది. ప్రజలు వాటిని కూడా తిరస్కరించేవారు. గాంధీజీ ఉప్పు సత్యాగ్రహాన్ని 1930 లో నిర్వహించారు, కానీ అంతకుపూర్వమే స్వదేశీ ఉద్యమంలో భాగంగా ఉప్పును బహిష్కరించవలసిందిగా మరియు కేవలం భారతదేశంలో తయారైన ఉప్పునే వాడాలి అని పిలుపునిచ్చారు తిలక్ గారు. ఇలా ప్రతి వాడ, ప్రతి గ్రామం,  ప్రతి ఊరు, ప్రతి నగరం స్వదేశీ ఉద్యమంతో నిండిపోయింది.
          ఒక దశలో తిలక్ గారు స్వదేశీ ఉద్యమంలో విద్యార్థులను కూడా నిమగ్నమవడానికి గాను పాఠశాలలను, కళాశాలలను వదిలిపెట్టమని పిలుపునిచ్చారు. మన దేశం స్వాతంత్ర్యంమే లేక, బానిసత్వంలో మగ్గుతుంటే ఇంకా ఎందుకు ఈ చదువులు అని అంటుండేవారు తిలక్ గారు. వారిచ్చిన పిలుపుననుసరించి ఎందరో విద్యార్థులు తమ తమ పాఠశాలలను, కళాశాలలను వదిలిపెట్టి స్వదేశీ ఉద్యమంలో పాలుపంచుకున్నారు. ఇలా లక్షలాది మంది స్వదేశీ ఉద్యమంలో భాగస్వాములైనారు. దీనితో ఊరూరా ఆంగ్లేయుల వస్త్రాలు తగలబెట్టబడ్డాయి. సూటు ధరించడం వదిలివేసారు, టై కట్టుకోవడం మానివేసారు. అప్పట్లో కొన్ని భారతీయుల కుటుంబాలు ఆంగ్లేయుల పద్దతులను అనుసరించడం గౌరవప్రదంగా భావిస్తుండేవారు. అటువంటి వారి ఇంటి ముందు సత్యాగ్రహాలు, ధర్నాలు, ప్రదర్శనలు జరుపుతుండేవారు స్వదేశీ ఉద్యమకారులు. తిలక్ గారు విద్యార్థులను తీసుకువెళ్లి ఆంగ్లేయుల ఉత్పత్తులను అమ్మే దుకాణాల ముందు ధర్నాలు, ప్రదర్శనలు నిర్వహిస్తుండేవారు. ఆంగ్లేయుల ఉత్పత్తులను కొనడానికి వచ్చిన వారికీ స్వదేశీ ఉద్యమం గురించి వివరిస్తుండేవారు. దానితో వారు సత్యం తెలుసుకొని వెళ్ళిపోయేవారు. కొందరైతే వినేవాళ్ళుకాదు, ఖచ్చితంగా వస్తువులను కొంటాము అని అంటుండేవారు. అలాంటి  సమయంలో ఎంతో శాంతంగా వారికీ అర్ధమయ్యేట్టు వివరించి ఆంగ్లేయుల వస్తువులను కొనకుండా చేసేవారు.
          ఒకసారి ఒక మొండి వ్యక్తి ఎదురై ఖచ్చితంగా ఆంగ్లేయుల వస్తువులను కోనేతీరుతాను అని భీష్మించుకూర్చున్నాడు. అప్పుడు వారు సరే అలానే వెళ్ళండి అని ఆ దుకాణంలోకి పంపించారు. కొంత సమయానికి ఆ వ్యక్తి బయటికి రాగానే స్వదేశీ ఉద్యమకారులు అతనిని చేరుకొని ఈ వస్తువులను ఇంతకీ కొన్నారు అని అడిగి తెలుసుకొని అంత డబ్బును ఆ వ్యక్తి చేతుల్లో పెట్టి ఆ వస్తువులను తీసుకోని ఆ వ్యక్తి ముందే తగలబెట్టినారు. దానితో ఆ వ్యక్తి, వారి కార్యదీక్షకు, వారు చేస్తున్న ఉద్యమ పట్టుదలకు ముగ్ధుడై వారిలో కలిసిపోయి స్వదేశీ ఉద్యమంలో నడిచాడు. ఒకసారి కొందరు యువకులు ఆంగ్లేయుల ఉత్పత్తులు అమ్మే దుకాణం ముందు ప్రదర్శనలు చేస్తూ ఆ దుకాణాదారునితో చెప్పారు, ఆంగ్లేయుల ఉత్పత్తులు అమ్మే మీ దుకాణాన్ని మూసివేయండి. మేము ఎలాగో కొనుగోలుదారులను రానివ్వము అని చెప్పి వచ్చిన కొనుగోలుదారులకు ఆంగ్లేయుల ఉత్పత్తులు కొనవద్దు అని స్వదేశీ ఉద్యమంను గురించి వివరిస్తున్నారు. అంతలో ఒక ఇద్దరు వ్యక్తులు మేము ఎలాగైనా కొని తీరుతాము అని బలవంతంగా దుకాణంలోకి వెళ్లారు. అప్పుడు ఈ స్వదేశీ ఉద్యమ యవకులు ఆ ఇద్దరు వ్యక్తులు దుకాణంలో నుండి బయటికి వచ్చేసరికి వారి మార్గానికి అడ్డంగా పడుకొని మేము ఎంత నచ్చచెప్పినా వినకుండా వెళ్లారు. ఇప్పుడు మీరు ఆ ఆంగ్లేయుల ఉత్పత్తులే కావాలనుకుంటే ముందు మా శరీరాల మీదినుంచి నడుచుకుంటూ వెళ్ళండి అని చెప్పారు. దాంతో ఆ వ్యక్తులు లోపలికి వెళ్లి ఆ ఉత్పత్తులు తిరిగి ఇచ్చివేసి వారు కూడా స్వదేశీ ఉద్యమంలో పాల్గొన్నారు.
          ఇలాంటి ప్రదర్శనలు మన దేశంలో స్వదేశీ ఉద్యమంలో జరిగినాయి. తర్వాత ఈ ఉద్యమానికి తలొగ్గి బ్రిటిష్ ప్రభుత్వం 1911 వ సంవత్సరంలో బెంగాల్ విభజనను వెనక్కుతీసుకున్నారు. ఇదే మొట్టమొదటిసారి బ్రిటిష్ ప్రభుత్వం ఓటమిని చవిచూడటం. అంతకు పూర్వం బ్రిటిష్ ప్రభుత్వం నిర్ణయించినది తప్పకుండా అమలుచేసేవారు, దానికోసం వారు ఎంతటి హింసకైనా వెనుకాడేవారు కాదు. కానీ బెంగాల్ విభజనను మాత్రం వెనక్కుతీసుకున్నారు. అది కేవలం స్వదేశీ ఉద్యమం వల్లనే సాధించగలిగారు. ఎలా అనగా.. ఆంగ్లేయుల ఉత్పత్తులు భారతదేశంలోని ప్రజలు బహిష్కరించేసరికి వారి అమ్మకాలు పడిపోయి వారికొచ్చే ఆదాయం సన్నగిల్లింది. దాంతో బ్రిటిష్ వాళ్ళు మీకు ఏమి కావాలి? అని అడిగారు. బెంగాల్ విభజనను రద్దు చేయాలి అని తిలక్ గారు కోరారు దాంతో 1911 వ సంవత్సరంలో బ్రిటిష్ ప్రభుత్వం బెంగాల్ విభజనను రద్దుచేసింది.
          1893 వ సంవత్సరంలో గణపతి మండళ్లుగా ప్రారంభమై, 1905 నాటికీ స్వదేశీ ఉద్యమంగా రూపుదిద్దుకొని, 1911 లో బ్రిటిష్ ప్రభుత్వం పై మొదటి విజయాన్ని సాధించింది. దీనికంతటికి కారణం మన లోకమాన్య బాలగంగాధర్ తిలక్ గారు. స్వదేశీ ఉద్యమం చూపిన విజయానికి రెట్టించిన ప్రోత్సాహంతో ఉద్యమాన్ని ఇంకా ఉదృతం చేసారు నవయువకులు. ఊరూరూ తిరిగి ప్రసంగాలు, ప్రదర్శనలు చేస్తున్న తిలక్ గారి ఆరోగ్యం సన్నగిల్లడం మొదలైంది. దీనికి వారి వార్ధక్యం కూడా తోడైంది. ఇక తన శరీరం సహకరించదు అనుకున్న తిలక్ గారికి గాంధీజీ భారతదేశానికి వస్తున్నాడని తెలిసింది 1914 వ సంవత్సరంలో. గాంధీజీ గురించి తెలుసుకున్న తిలక్ గారు, ఈ ఉద్యమాన్ని ఇతని చేతిలో పెట్టడం సరియైనది అని తలిచారు.
          1915 వ సంవత్సరంలో గాంధీజీ భారతదేశానికి వచ్చారు, అప్పుడు తిలక్ గారు వారిని కలుసుకొని ఈ ఉద్యమం అంతా వివరించి, నా అనారోగ్య కారణంగా నేను ఈ స్వదేశీ ఉద్యమాన్ని ముందుకు తీసుకపోలేనని చెప్పి, ఇప్పుడు ఈ స్వదేశీ ఉద్యమంను మీ చేతిలో పెడుతున్నాను అన్నాడు. అలా తిలక్ గారి నుంచి గాంధీజీ స్వదేశీ ఉద్యమాన్ని స్వీకరించారు. ఆ తరువాత గాంధీజీ స్వదేశీ ఉద్యమంలో ఒకటి జోడించారు. అది ఏమనగా ఆంగ్లేయుల వస్త్రాలను ధరించము, ఉన్నవాటిని దగ్ధం చేద్దాం, దానితో పాటు మనమే వస్త్రాలను తయారుచేసుకుందాం అని ఆ గణపతి మండళ్ల స్వదేశీ ఉద్యమ కార్యకర్తలకు ఖాదీ వస్త్రాల గురించి చెప్పారు. అలా మన దేశంలో ఖాదీ వస్త్రాలు తయారుచేయడం మొదలైనాయి. ప్రతి ఒక్కరు రాట్నం తిప్పడం, వస్త్రాలు తయారుచేయడం మొదలుపెట్టారు. అంతకుముందు రాట్నంతో లావుపాటి చద్దర్లు, తివాచీలు తయారుచేసేవారు కానీ ధరించే వస్త్రాలు తయారుచేయడం ప్రాచిన్యంలో ఉండేదికాదు.
          ఇలా గాంధిజీ ఊరూరా తిరిగి ఆంగ్లేయుల ఉత్పత్తులను బహిష్కరించమని దానితో వాటికీ ప్రత్యామ్నాయంగా ఆ వస్తువులను మనమే తయారు చేసుకుందాం అని ప్రోత్సహించేవారు. అలా వారి ప్రబోధాల వల్ల భారతదేశంలో చిన్న చిన్న నిత్యవసర ఉత్పత్తులను స్వయంగా తయారుచేయడం మొదలుపెట్టారు. ప్రతి ఇంట్లో రాట్నం వెలిసింది, దానితో నూలుతీసి ఖాదీ వస్త్రాలు నేయడం మొదలైంది. దీనితో ఇంగ్లాండు ఉత్పత్తులు మరియు వస్త్రాల అమ్మకాలు మొత్తానికే తగ్గాయి. దీంతో బ్రిటిష్ వారికీ వచ్చే లాభాలు ఆగిపోయి, నష్టాలను చవిచూడటం మొదలైంది, ముఖ్యంగా లాంకషైర్, మాంచెస్టర్, లివర్పూల్ లో తయారయ్యే వస్త్రాలు ఇక్కడ అమ్మకాలకు నోచుకోలేకపోయాయి. అలాగే ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క ఉత్పత్తులు కూడా ఇక్కడ అమ్మకాలు ఆగిపోయాయి. క్రమక్రమంగా ఆంగ్లేయుల వ్యాపారం అస్తవ్యస్తంగా సాగింది. చివరికి ఆంగ్లేయులు భారతదేశాన్ని వదిలిపెట్టవలసిందే అని నిర్ణయించుకున్నారు.
          ఆ తరువాత 1930 వ సంవత్సరంలో గాంధీజీ ఉప్పు సత్యాగ్రహం చేసారు. ఉప్పు సత్యాగ్రహంలో లక్షలాది మంది భారతీయులు జైళ్లకు వెళ్లారు. ఇక ఆంగ్లేయుల పరిస్థితి ఎలా తయారైంది అంటే, ప్రజలను బంధించడానికి జైళ్లలో ఖాళీ లేకుండా పోయింది. జైళ్లు నిండిపోయాయి. జైళ్లకు వెళ్ళడానికి భారతీయులు మమ్మల్ని జైల్లో పెట్టండి అని యువకులు, కార్యకర్తలు, గృహిణిలు, విద్యార్థులు, చిన్న పిల్లలు కూడా ముందుకు వచ్చి ఆనందంగా వెళ్ళడానికి సిద్దపడడంతో బ్రిటిష్ ప్రభుత్వానికి పెద్ద సమస్యగా మారింది. ఎందుకనగా ఆ కాలంలో జైళ్లు తక్కువగా ఉండేవి. మొదట్లో మనం వీళ్ళను జైల్లో పెడతామని బెదిరించి అణిచిపెట్టేవాళ్ళం, ఇప్పుడు వాళ్ళ మనస్సులో జైలు అంటేనే భయం లేకుండా పోయింది. లాఠీ అన్న భయంలేకుండా పోయింది. తూటాల వర్షంకు కూడా భయపడటం మానివేసారు. దీనితో ఇక మనం భారతదేశాన్ని వదిలిపెట్టక తప్పదని బ్రిటిష్ ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఆ తరువాత 1937 వ సంవత్సరంలో భారతదేశాన్ని వదిలిపెట్టాలని ఆంగ్లేయులు ఇంగ్లాండులో తమ పార్లమెంటులో తీర్మానించుకున్నారు.
          దీనికి తోడు 1939 వ సంవత్సరంలో 2వ ప్రపంచ యుద్ధం మొదలైంది. ఈ 2వ ప్రపంచ యుద్ధంలో ఇంగ్లాండుకు దారుణమైన దెబ్బ తగిలింది, తీవ్రమైన నష్టం కలిగింది. ఇగ వారికీ భారతదేశం మోయలేని భారంగా తోచింది. చివరికి 1945 వ సంవత్సరంలో బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశాన్ని వదిలిపెడతాము అని ప్రకటించింది. ఆ పైన 1947 వ సంవత్సరంలో భారతదేశాన్ని వదిలివెళ్లారు. మనం స్వతంత్రులమైనాము. ఇలా మనకు స్వాతంత్ర్యం లభించడంలో స్వదేశీ ఉద్యమం ప్రధాన పాత్ర పోషించింది. ఆ స్వదేశీ ఉద్యమం విస్తరించడంలో గణపతి ఉత్సవాలు ఎంతో ముఖ్య పాత్ర పోషించాయి. అలా మొదలైన గణపతి ఉత్సవాలు ఇప్పుడు ఎలా జరుగుతున్నాయి? అప్పుడు వారికీ ఒక మార్గం కోసం ఉత్సవాలు జరుపుకున్నారు, కానీ అదే ఇప్పుడు ఆడంబరాలకు, ఆర్భాటాలకు జరుపుతున్నారు. వాటిని జరపడానికి తిలక్ గారు ఏ ఉద్దేశ్యం కోసం ప్రత్నించారో ఇప్పుడున్న మనందరం ఒకసారి ఆలోచించాల్సిందే.
          అప్పటి గణపతి ఉత్సవాలతో స్వదేశీ ఉద్యమం రూపుదిద్దుకుంది. అలాగే ఇప్పుడున్న పరిస్థితిలో కూడా మనకు స్వదేశీ ఉద్యమం ఎంతో అవసరం ఉంది. ఎందుకనగా ఆనాడు ఒక్క దేశమే మనపై జులుం చేస్తుండేది మరియు ఈస్ట్ ఇండియా కంపెనీతో మరో 4, 5 కంపెనీలు మన ఆర్ధిక స్థితిగతులను మారుస్తుండేవి. కానీ నేడు మనకు స్వాతంత్ర్యం వచ్చిన ఆర్ధికంగా మాత్రం మనం కొన్ని దేశాల చేతుల్లో కీలుబొమ్మలుగా ఉంటున్నాము. అలాగే కొన్ని వేల కంపెనీలు మన ఆర్ధిక స్థితిగతిని నిర్ణయిస్తున్నాయి. వివరంగా చెప్పాలంటే ఇప్పుడు మనలో మనకు స్వదేశీయత రావాలి. ఆనాడు తిలక్ గారు చెప్పారు, స్వదేశీయత వస్తే స్వాతంత్ర్యం వస్తుంది అని. అది ఇప్పటి మనకు కూడా వర్తిస్తుంది.
          ఆ కాలంలోని భారతీయులు ఎంత కష్టపడి, లాఠీదెబ్బలు, తూటాల దెబ్బలు, జైలు జీవితాలు అనుభవించి స్వదేశీ ఉద్యమం చేసి ఈ స్వాతంత్ర్యం తెచ్చారు. కానీ మనం ఇప్పుడు ఆ స్వతంత్ర్యాన్ని మనకు తెలువకుండానే పరోక్షంగా అధిక సంఖ్యలో విదేశీ ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటూ మన స్వాతంత్ర్యాన్ని, మన ఆర్ధిక విలువలను విదేశీయుల కంపెనీల చేతిలో పెడుతున్నాము. ఇలా అయితే కాలానుగుణంగా మారుతున్న పరిస్థితులకు, అభిప్రాయాలకు దాసోహం చెప్పి మా ఇష్టాలకు, స్వేచ్ఛను ఆపుకోవాలా? అని అడుగుతారు. అలా అడిగే ముందు ఒక్కసారి ఆలోచించండి... ఆనాడు మన వాళ్ళు స్వదేశీ ఉద్యమం జరపకుండా, ఆంగ్లేయుల వస్తువులను వాడుతూ ఉంటె ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉండేది? అప్పుడు వాళ్ళు చేసిన కృషికి ఈనాడు మనం ఇలా స్వేచ్ఛగా ఉన్నాం, మరి అలాగే మనం కూడా అలానే ఉంటె వచ్చే భవిష్య తరం ఎలా ఉంటుంది, ఆలోచించండి.
          విదేశీ వస్తువుల వల్ల కలిగే లగ్జేరి  వాటితో వచ్చే కంఫర్ట్ లాంటివి మరియు సమయం ఆదా అయ్యే ఉపయోగాలు ఉంటాయి. అంతేకాక అలాంటి వస్తువులు మన దేశంలో లేవు కావున వాటిని విక్రయించక తప్పడం లేదని చెబుతారు. ఇక్కడ ఒక విషయం గమనించండి, ఆనాడు తిలక్ గారు చెక్కర, బ్లేడు, సబ్బులు, ఉప్పు లాంటి వాటిని బహిష్కరించినప్పుడు ప్రజలందరూ అప్పటి లగ్జేరి ని, కంఫర్ట్ ను, చివరికి జీవనోపాధి అయిన వృత్తులను కూడా వదిలారు. వారితో పోలిస్తే మనమెంత ఆలోచించండి! వాటికీ ప్రత్యామ్నాయంగా మనమే వస్తువులను తయారుచేస్తుకుందాం అని తిలక్ గారు, గాంధీజీ చెప్పారు కదా, అలానే కొంచెం కష్టపడితే మనం కూడా ఆ వస్తువులను తయారు చేసుకోవచ్చు. మనం వాడే విదేశీ వస్తువుల వల్ల మన దేశంలో వస్తువులను తయారుచేసే కంపెనీలు మూతపడుతున్నాయి. ఎందుకంటే మన విదేశీ వస్తువుల మోజుతో వీటిని పట్టించుకోపోయేసరికి అవి నష్టాలను చవిచూసి. విదేశీయులా మనం తయారుచేయలేము అని అనుకోకండి. ఒకటి గమనించండి! ఆనాడు బ్రిటిష్ వారు మన దేశానికి వచ్చిందే మన దగ్గర ఉన్న విలువైన సంపద కోసం, అలాంటి సంపద కల్గిన మనం ఎంతో సాధించుకోవచ్చు. అలాగే మన దేశ పూర్వ చరిత్రలోకి వెళితే మన సంస్కృతీ, మన దగ్గర ఉన్న మెదస్తూ చూస్తే అర్ధమవుతుంది. ఇది చూసే, దీనిని తస్కరించడానికే మనతో వ్యాపారం పేరుతొ వచ్చి మనల్ని లొంగదీసుకుని, మనపై దాదాపుగా 200 సంవత్సరాలు పెత్తనం సాగించారు.
          విదేశీయులంతటి విజ్ఞాన సంపద మన దగ్గర లేదా? అంటే ఎందుకు లేదు, ముందుగా మనం ఈ స్వదేశీ ఉద్యమం ప్రారంభిస్తే తిరిగి మన దేశంలో వ్యాపార రంగం అభివృద్ధి చెంది, మన దేశ ఆర్ధిక స్థితి మెరుగుపడుతుంది. అందుకు మనం ఒక్కటే ఒకటి స్వదేశీ ఉద్యమంతో నడవాలి అంతే. నేనొక్కడినే నడుస్తే సరిపోతుందా! అందరు నడవాలి కదా అని సాకులు చెప్పకండి. ఆనాడు తిలక్ గారు నా ఒక్కడితో ఏమవుతుంది అని అనుకోలేదు. ఒక్కరి ఆలోచనతో మొదలై ఒక్క గణపతి మండలిగా ప్రారంభమై వందల సంఖ్యలతో గణపతి మండళ్ళుగా రూపుదిద్దుకొని, అందులోంచి వేలాదిమంది కార్యకర్తలుగా ఉద్భవించి, స్వదేశీ ఉద్యమంగా వెలిసి, లక్షలాది మంది దానిలో పాల్గొని, కోట్లాదిమంది కల్గిన భారతదేశానికి స్వాతంత్ర్యం సంపాదించిపెట్టారు. అలానే నా ఒక్కడి వల్ల ఏమవుతుంది అని అనుకోకుండా, ముందుకు అడుగువేయాలి. ఇది ఒక సంవత్సరం, రెండు సంవత్సరాలల్లో సాధించేది కాదు. ఆ కాలంలో 1893 లో ప్రారంభిస్తే 1930 సంవత్సరం తర్వాతగానీ దాని ప్రభావం స్పష్టమైంది. ఇప్పుడు అంత సమయం పట్టదుకాని మనం ఓపికతో, సహనం కలిగి ఉండాలి. అంతేగాని నిరుత్సాహంతో మధ్యలో వదిలిపెట్టకూడదు.
          ఆనాటి స్వదేశీ ఉద్యమ స్ఫూర్తి ఈనాటి మనందరిలో కలగాలని ఆశిస్తూ... జై హింద్.

భవతు సర్వ మంగళం

కామెంట్‌లు