గణపతి ఉత్సవాల వెనక అసలు రహస్యం / స్వదేశీ ఉద్యమం - 1



వినాయక చవితి జరుపుకోవటం ఒకప్పుడు భారతదేశంలో అనుమతి లబించేదికాదు. నేడు మనం పూర్తీ స్వేచ్ఛతో వైభవోపేతంగా జరుపుకుంటున్నాము. మన దేశాన్ని ఆంగ్లేయులు పరిపాలిస్తున్న సమయంలో ఇలా జరుపుకోవడానికి అనుమతి ఉండేదికాదు. భారతీయులు అధిక సంఖ్యలో గుమికూడడానికి, సంఘటితం కావడానికి అనుకూలమైన ఏ పండుగను అనుమతించేవారు కాదు. ఇటువంటి ఎంతో గొప్ప ధార్మిక కార్యకలాపాలపైనా చట్టపరమైన నిషేధం కొనసాగుతూ ఉండేది, దీనిని బ్రిటిష్ ప్రభుత్వం రూపొందించింది. ఇదే ఇప్పుడు సెక్షన్ 144 గా  ఉంది. ఈ చట్టం బ్రిటిష్ ప్రభుత్వం రూపొందించడానికి గల కారణం ఏమనగా భారతీయులెవ్వరూ సంఘటితం కాకుండ చూడడానికి, ఎందుకనగా అలా సంఘటితమైతే బ్రిటిష్ వారిపై తిరుగుబాటు కార్యకలాపాలను రూపకల్పనలు చేస్తారని, మన భారతీయులందరిని ఒకరితో ఒకరికి సంబంధం లేకుండా విడగొట్టుతే వారి పరిపాలన మన దేశంలో ఉదృతం కావడానికి, మనం తరతరాల వరకు బానిసలుగా మలచుకోవడానికి వారు ఈ విధమైన చట్టాలు చేసేవారు.
          ఆనాడు భారతీయులల్లో ఎంతటి భయం ఉండేదంటే ఒక ఊరిలోకి క్రిందిస్థాయి పొలిసు వచ్చిన లేక అతని దగ్గర ఎటువంటి ఆయుధాలు లేకపోయినా కేవలం పొలిసు దుస్తులు ధరించివచ్చిన, ఆ ఉరి ప్రజలు భయకంపితులై ఎవరికివారు ఇంట్లోకి వెళ్లి తలుపులు బిగించుకునేవారు. ఏదైనా సందర్భంలో గుంపులుగా సంఘటితం అయినప్పుడు ప్రజలు భయకంపితులు అవుతుండేవారు. ఎందుకనగా అలా గుంపులుగా ఏర్పడినప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం ఆ గుంపులపై లాఠీఛార్జి, తుపాకీ గుళ్ళ వర్షం, దొరికినవాళ్లను జైల్లో బంధించడం చేసేవారు.
          బ్రిటిష్ వారి అరాచకాలకు తలొగ్గి, వారి బానిసలుగా జీవిస్తున్న భారతీయులను మార్చి  వారిలోని భయంను పోగొట్టి, ధైర్యవంతులుగా చేసి, వారు ఏమి చేసిన తట్టుకొని, ఒకే మాటపై ఒకే బాటపై నడిచి, బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేసి వారినుంచి స్వాతంత్ర్యం సాదించుకోవకానికి ఏమి చేయాలా అని ఆలోచిస్తుండేవారు మన లోకమాన్య బాలగంగాధర్ తిలక్ గారు.
          అలా వారు ఆలోచించగా ఆలోచించగా ఒక ఉపాయం స్ఫురించింది వారికి, ఏదైనా ధార్మిక కార్యక్రమాన్ని సామూహికంగా ఆచరించే విధానాన్ని ప్రారంభించాలి అని. ఎందుకంటే భారతదేశంలోని భారతీయులకు ధార్మిక విషయాలపై శ్రద్ధ ఎక్కువగా ఉంటుంది. అది ఎంతో సహజమైన విషయం కూడా, ఎందుకంటే భారతదేశంలో విలసిల్లిన సనాతన సంస్కృతీ యొక్క ధార్మికమైన పునాదులు ఎంతో పటిష్టమైనవి, అవి ఇనాటివి కావు వేల సంవత్సరాల క్రితంవి. అందుకే లోకమాన్య తిలక్ గారు కూడా ఈ విధంగానే ఆలోచించారు. ఈ దేశంలోని ప్రజల్లో ధార్మికత పట్ల శ్రద్ధ ఎంతో విస్తృతమైంది అందుకే ఏదైనా ధార్మిక కార్యక్రమాన్ని సామూహికంగా నిర్వహించేటట్లు చేస్తే జనుల మనస్సుల నుంచి భయాన్ని కొద్దిగా తొలగించగలుగుతాము అని ఆలోచించి, అప్పటివరకు ఎవ్వరి ఇంట్లో వాళ్ళు జరుపుకునే వినాయక చవితిని ప్రతి ఊర్లో ప్రజలందరూ కిలిసి సామూహికంగా గణపతి ఉత్సవాలు జరుపుకోవాలని 1893 వ సంవత్సరంలో ఇప్పటి మహారాష్ట్రలోని పూణే సమీపంలోని ఒక గ్రామంలో మొట్టమొదటగా ప్రకటించారు.
          ఆ తరువాత వారు ఊరూరూ తిరిగి ప్రజలకు బోధించేవారు. మనం వినాయక చవితి మహోత్సవాలను ఘనంగా జరుపుకోవాలి, ఆ మహోత్సవ నిర్వాహక మండలిగా జనులందరు ఏకంకావాలి. ఈ నిర్వాహక మండళ్లను ఏర్పాటుచేయడంలో ఆయన ఉద్దేశ్యం జనులందరిని సంఘటితపరచడమే. అలా ఆయన 1893 వ సంవత్సరం నుండి ఊరూరూ తిరిగి ప్రతి గ్రామంలో గణపతి మండళ్లను స్థాపించడం మొదలుపెట్టారు. ఈ గణపతి ఉత్సవాల పేరుతొ జనులందరిని సంఘటితపరచి ఒక ఉన్నతమైన కార్యానికై ప్రేరణ అందించాలి. అందుకు వారు పర్యటించడం ప్రారంభించారు. ప్రతి చోట ప్రసంగించేవారు. ఇలా జనులందరిని సంఘటితపరచడానికి ఊరూరూ తిరగడం వలన వారి న్యాయవాది వృత్తికి ఆటంకం ఏర్పడుతుండేది. దీనికై వారు తమ న్యాయవాది వృత్తిని వదిలివేసారు. ఇప్పుడున్న పరిస్థితిలో న్యాయవాది వృత్తి ముఖ్యం కాదు, బ్రిటిష్ వాళ్ళ అన్యాయాలను ఎదుర్కోవడానికి భారతీయులందరిని సంఘటితపరిచి వారిలో ధైర్యం నింపి బ్రిటిష్ వాళ్ళను ఎదుర్కొనే ధీరులుగా తయారుచేసి, భారతావనిని బానిస సంకెళ్లనుండి విముక్తి చేయడమే నా ప్రధానమైన బాధ్యత అని భావించారు.
          ప్రతి గ్రామంలో గణపతి మండళ్లను ఏర్పరిచి వారికీ ఇలా ప్రబోదించేవారు, గణపతి విఘ్ననాశకుడు, ఏ రకమైన అడ్డంకులైనా తొలగించేదేవుడాయన. అందుకే మనం ఏ పుణ్యకార్యాన్ని ఆరంభించిన ఆ కార్యం ఎటువంటి ఆటంకాలు లేకుండా, సుసంపన్నం కావడానికి మనం ముందుగా గణపతిని పూజిస్తాము. అలాగే ఇప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం మనల్ని బానిసలుగా చేసుకొని మనపై సృష్టిస్తున్న అరాచకాలను తిప్పికొట్టి వారి నుండి మనం విముక్తులను కావడానికి ఒక యజ్ఞం లాంటి కార్యం చేయవలసిఉంది, దానికి ఈ బ్రిటిష్ ప్రభుత్వం ఎన్నో ఆటంకాలను కలిగిస్తుంది. అందుకు ఆ ఆటంకాలను తొలగించడానికి మనం ఈ గణపతి ఉత్సవాలను ప్రతి గ్రామంలో నిర్వర్తించాలి. దానితో ఆ ఆటంకాలను ఆ గణపతి దేవుడే చూసుకుంటాడు అని వారు అందరి ప్రజల్లో ధైర్యం నింపడం మొదలుపెట్టారు. దీనితో వారిలో కొంత ధైర్యం కూడి ప్రతి గ్రామంలో గణపతి మండళ్లను ఏర్పాటుచేసుకోవడం మొదలుపెట్టారు. ఇలా లోకమాన్య తిలక్ గారు ఊరూరూ తిరిగి అందరి గుండెల్లో ధైర్యం నిండే విదంగా ప్రబోధాలు చేస్తుండటంతో ఒక్క గణపతి మండపంతో ప్రారంభమై అలా అలా దాదాపుగా అన్ని గ్రామాల్లో గణపతి మండళ్ల ఏర్పాటు అయినాయి. అందుకు బ్రిటిష్ ప్రభుత్వం ఇలా వదిలేస్తే కష్టమని భావించి ప్రజల్లో భయం నింపడానికి గణపతి మండళ్ల అధ్యక్షులను తీసుకొనివెళ్ళి జైల్లో బందించేవారు. అయినా తిలక్ గారు నింపిన ధైర్యం ముందు అవి ఏమి పనిచేయలేకపోయింది. అలా వారి బోధనలతో ప్రతి పౌరిడిలో ధైర్యం నిండి, వారంత సంఘటితమై, ఆ సంఘటితములనుండి కార్యకర్తలుగా మారుతుండేవారు.
          1897, 1898 సంవత్సరానికి చాలా గ్రామాల్లో సామూహికంగా గణపతి ఉత్సావాల్లను ఘనంగా నిర్వహించడం మొదలైది. ఇగ 1900 వ సంవత్సరానికి విసృతరూపం దాల్చింది. ఇలా 1893 నుండి 1900 సంవత్సరాల వరకు ఊరూరూకి వెళ్లి ప్రసంగాలు ఇచ్చి గణపతి మండళ్లను స్థాపించి, ప్రజల్లను సంఘటితపరచి ఒక లెక్కకుమించిన కార్యకర్తలు కల్గిన దళాన్ని నిర్మించగల్గినారు. వారి ఆలోచన ఏమి అనగా ఇలా ఊరూరా.. గణపతి మండల్ల ద్వారా ఏర్పడిన కార్యకర్తలతో దేశ స్వాతంత్ర్య సమర మహాకార్యంలో వినియోగించాలి అని. అంతేగాని కేవలం గణపతి ఉత్సవాలతో ఆగలేదు వారి ఆలోచన.
          గణపతి ఉత్సవం అనేది కేవలం 9 లేక 10 రోజులు ఉంటుంది, మిగతారోజుల్లో కార్యకర్తలు ఏమి చేస్తారు? అలా సంఘటితమైన కార్యకర్తలు ఇలా ఈ 9, 10 రోజుల్లో పెంచుకున్న ధైర్యంతో ఎదో ఒక సత్ కార్యం వైపు నిమగ్నంకావడానికి ప్రయత్నిస్తారు. అందుకే లోకమాన్య తిలక్ గారు ఇంతటి దూర దృష్టితో ఒక విస్తారమైన కార్యకర్తల దళాన్ని రూపొందించడానికి సంకల్పించారు. అది 1900 వ సంవత్సరం నాటికీ సఫలీకృతం అయింది. అప్పుడు తిలక్ గారు అనుకున్నారు చాలామంది కార్యకర్తలుగా తయారయినారు, ఇదే అనువైన సమయం బ్రిటిష్ వారి అరాచకాలను తిప్పికొట్టడానికి. కొంతకాలానికి ఈ కార్యకర్తలే మన లోకమాన్య తిలక్ గారి దగ్గరికి వచ్చి మేము ఇప్పుడు ఏమిచేయాలి ఈ భారతావనిని బ్రిటిష్ వాళ్ళ సంకెళ్లనుండి విడిపించడానికి అని అడిగారు. చూసారా... ఒకప్పుడు భారతావనిలో ప్రజలు భయాలతో, బ్రిటిష్ వారి అరాచకాలను భరిస్తూ, ఒక క్రింది స్థాయి పొలిసు వచ్చిన భయపడే వారు, ఇప్పుడు ఈ భారతావనిని సంకెళ్లనుండి విముక్తికి మేము ఏమి చేయాలి అని అడిగే ధైర్యవంతులుగా మారినారు, దీనికంతటికి కారణం మన లోకమాన్య బాలగంగాధర్ తిలక్ గారి కృషి, వారి దూరదృష్టి.
          అప్పుడు తిలక్ గారు వారికీ ఒకటి ప్రబోధించారు, ఇప్పుడున్న ఒకేఒక పరిష్కారం సంపూర్ణ స్వాతంత్ర్యం కోసం పోరాడడం. స్వాతంత్ర్యం నా జన్మ హక్కు అని తిలక్ గారు నినదించారు. ఆ స్వాతంత్ర్యం రావాలంటే ముందుగా మన దేశంలో స్వదేశీయత రావాలి. స్వదేశీయత రానంతవరకు స్వాతంత్ర్యం రాదు, స్వదేశీయత వస్తే స్వాతంత్ర్యం తప్పకుండా వస్తుంది. ఆ తరువాత స్వదేశీయత మరింత పెరుగుతుంది అని పుణేలో జరిగిన బహిరంగ సభలో ఉద్భోదించారు. ఇలా వారు మొదట్లో గణపతి ఉత్సావాళ్ళకోసం ఏ మండళ్లను స్థాపించారో ఆ గణపతి మండల్లోని సభ్యులైన కార్యకర్తలతో చెప్పారు, ఇక స్వదేశీ ఉద్యమాన్ని కొనసాగించండి అని. అలా ఆ స్వదేశీ ఉద్యమంతో ప్రారంభమైంది మన స్వాతంత్ర్య సమరం. ఆ తరువాత తిలక్ గారి వయస్సు, అనారోగ్యాల కారణంగా ఈ కార్యాన్ని నడిపే భాద్యత తిలక్ గారు గాంధీ గారికి అప్పగించారు. అలా అలా స్వదేశీ ఉద్యమం విస్తృతమై చివరికి మనకు స్వాతంత్ర్యం సంపాదించుకోగలిగాము. ఈ స్వదేశీ ఉద్యమం గురించి మనం ఇంకొక భాగంలో తెలుసుకుందాం.
          మన ఈ స్వాతంత్ర్యం రావడానికి మొట్టమొదటి అడుగుగా తిలక్ గారు సామూహిక గణపతి ఉత్సవాలను తీసుకువచ్చారు. అలా మనం ఈ గణపతి ఉత్సవాలతో ఒకరికొకరం సంఘటితమై, కార్యకర్తలుగా రూపొంది, స్వాతంత్ర్య సమర దళాలుగా మరి బ్రిటిష్ వారిని ఎదుర్కొన్నాం. అలా మొదలుపెట్టుకున్న ఈ గణపతి ఉత్సవాలను మరి మనం ఇప్పుడు ఏ విధంగా జరుపుకుంటున్నాము? అప్పుడు ఊరంతా కలిసి ఒక గణపతి మండలిగా ఉంటె, ఇప్పుడు ఒకే ఊర్లో 4,5 మండళ్ళుగా విస్తరించినాయి. అదే పట్టణాలల్లో అయితే లెక్కేలేదు. మనం భారతీయులం ఒకే దారిలో ఒకే మాటపై నడవాల్సింది పోయి ఎవరికివారు తమ ఇష్టాలుగా మండళ్లు పెట్టి ఒక మండలికి మరో మండలికి పోటీగా ఉత్సవాలు జరుపుతున్నారు, కానీ ఆనాడు తిలక్ గారు ఏ ఉద్దేశ్యంతో ఈ కార్యం ప్రారంభించారో అది ఈ కాలంలో కనుమరుగైంది. స్వాతంత్ర్యం  కోసం ఏర్పడిన గణపతి మండళ్లు స్వాతంత్ర్యం వచ్చాక స్వేచ్ఛతో మెల్లిమెల్లిగా కాలానుగునంగా మారుతూ అప్పటి దీక్ష, పట్టుదల మరిచి పోటీతత్వానికి ప్రతీకగా, ఒకరు గణపతి ఉత్సవం ఇలా జరిపారు అంటే మనం అంతకంటే రెట్టింపుగా ఉత్సవం చేయాలనీ పోటీగా చేస్తున్నారేగాని దాని అంతరార్ధం విస్మరించినాము. ఆనాడు భారతీయులందరు ఏకం కావడానికి ఏర్పడిన మండళ్లు, ఈనాడు మా గ్రూపు మీ గ్రూపు అని అనుకోవడంగా తయారయినాయి.
          గణపతి విగ్రహంలో కూడా పోటీతత్వమే. వినాయక చవితి పరమార్ధం ప్రకృతితో పాటుగా జీవించడం. అలాంటిది ఈనాడు గణపతి విగ్రహాలను ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో చేసి నీటి కాలుష్యం చేస్తున్నాము. ఉదయం, సాయంత్రం బ్రాహ్మణులు వచ్చి గణపతి పూజ చేస్తారు, అంతే ఒక్క ఆ సమయంలో భక్తి పాటలు వినిపిస్తారు, మిగతా సమయమంతా సినిమా పాటలు వినిపిస్తారు. రాత్రి 10, 11 గంటల వరకు పెద్ద పెద్ద లౌడ్ స్పీకర్లతో హోరెత్తిస్తారు, సినిమా పాటలకు డ్యాన్సులు, సినిమాలు వేస్తుంటారు. ఇలా శబ్ద కాలుష్యం చేస్తూ జీవన గమనానికి ఆటంకం చేసుకుంటున్నాము. ఆనాడు అంటే స్వాతంత్ర్యం కోసం ఈ గణపతి రాత్రుల్లో చర్చించుకునేవాళ్లు, ప్రజలను సంఘటితం చేసి వారి భయాలను పోగొట్టే విదంగా ప్రసంగాలు ఉండేవి, మరి ఇప్పుడు ఏమి చేయాలి? మనకు స్వాతంత్ర్యం వచ్చింది కదా అని అనుకుంటున్నారు. అసలు చేయాల్సింది ఇప్పుడే, స్వాతంత్ర్యం  వచ్చింది కాబట్టే మనం పూర్తీ స్వేచ్ఛతో మన దేశ సంస్కృతిని కాపాడే దిశగా ఈ గణపతి ఉత్సవాలు ఉండాలి. మనం సంఘటితం అయ్యేదే ఈ ఉత్సవాల్లో కాబట్టి ఈ గణపతి రాత్రుల్లో మన ధార్మిక ప్రసంగాలు, మన సంస్కృతిని పరిచయం చేసే విదంగా కార్యక్రమాలు ఉండాలి. కానీ ఏ ఒక్క గణపతి మండళ్లు అలా చేయటం లేదు, ఇలా అయితే మన భారతదేశ సంస్కృతి ఉనికి ఎటు వెళ్తుంది.
          గణపతి నిమర్జనాలు అని పెద్ద పెద్ద శబ్దాలతో స్పీకర్లు పెట్టి, విద్యుత్ దీపాలతో ఊరేగిస్తూ, టపాకాయలను కలుస్తూ వాయు కాలుష్యం చేస్తుంటారు. అది కాక నిమర్జన ఊరేగింపులో వెర్రి వెర్రి కుప్పిగంతులు వేసుకుంటూ, ఆ కుప్పిగంతులు వేయడానికి అని గణపతి విగ్రహాల వెనక మధుపానీయాలు సేవిస్తూ, గణపతి ముందు గుప్పిగంతులు వేస్తూ అడ్డొచ్చిన వాళ్ళను బెదిరిస్తూ, జనానికి ఆటంకాలు కలిగిస్తూ సంఘ కాలుష్యం చేస్తుంటారు. వినాయక చవితి పూజ విధానం క్షుణంగా చదివితే తెలుస్తుంది, ఆ దేవుడి పూజ మర్మం ఏంటి అని, ప్రకృతితో మన జీవనం ఎంత ముడిపడి ఉందొ అని. అది పట్టించుకోకుండా ఇలా అన్నింటిని కాలుష్యాలు చేసుకుంటూ ఇలా గణపతి ఉత్సవాలను చేయటం సముచితమా? ఆలోచించండి...
          ఆనాడు తిలక్ గారు ఆలోచించి ప్రారంభించినదాన్ని ఈనాడు మనం ఈ విధంగా బ్రష్టు పట్టించడం సరియైనదేనా? అప్పుడు స్వాతంత్ర్యం  కోసం మొదలుపెట్టిన ఈ ఉత్సవాలు ఈనాడు మనం మన దేశ సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా ప్రసరించే విదంగా జరుపుకోవాలే గాని , ప్రస్తుతం జరుపుకుంటున్నట్లు కాదు. ప్రతి ఒక్క భారతీయుడు దీనిపై ఆలోచించి గణపతి ఉత్సవాలను ప్రకృతికి కాలుష్య భంగం కలుగకుండా, భారతీయ సంస్కృతిని పెంపొందించే విధంగా జరుపుకుంటారని ఆశిస్తున్నాను.

భవతు సర్వ మంగళం

కామెంట్‌లు