A Story of Buddha and Swan

దయ



A Story of Buddha and Swan

పూర్వం కపిలవస్తు నగరాన్ని శుద్దోధనుడు అనే రాజు పరిపాలించేవాడు. అతని కొడుకు గౌతముడు. అతనికి సిద్ధార్థుడు అనే పేరు కూడా ఉన్నది. గౌతముడు చిన్నతనం నుండి పెద్దల మీద గౌరవం, భూతదయ వంటి సుగుణాలతో పెరిగాడు. దేవదత్తుడు అతని చిన్ననాటి మిత్రుడు. 
         ఒకనాడు వాళ్లిద్దరూ నది తీరానికి పోయారు. అక్కడ ఆకాశంలో హాయిగా ఎగిరే హంసలను దేవదత్తుడు చూశాడు. వాటిని వేటాడాలని బాణంతో కొట్టాడు. ఆ బాణం ఒక హంసకు తగిలి గిలగిలా కొట్టుకుంటూ గౌతముని ముందుపడ్డది. గౌతముడు జాలితో, కింద పడ్డ హంసను ఒడిలోకి తీసుకోని నెమ్మదిగా బాణం తీశాడు. దాని శరీరాన్ని నిమురుతూ దానికి ఊరట కలిగించాడు. 
          అప్పుడు దేవదత్తుడు అక్కడికి వచ్చి, "నేను హంసను కొట్టాను కాబట్టి అది నాదే!" అన్నాడు. "మిత్రమా! ఆకాశంలో హాయిగా ఎగిరే హంసను ఎందుకు హింసించావు? జీవహింస పాపం కదా!" అంటూ హంసను ఇవ్వడానికి గౌతముడు ఇష్టపడలేదు. దాంతో వాళ్ళ కొట్లాట రాజుగారి దగ్గరికి పోయింది. 
          ఇద్దరూ రాజాస్థానంలో న్యాయాధికారికి విన్నవించారు. దేవదత్తుని బాణం వల్ల హంస చచ్చిపోతే అది అతనిది అయ్యేది. కానీ భూతదయతో గౌతముడు దాని ప్రాణాన్ని కాపాడినందు వల్ల అది గౌతమునిదే అవుతుందని న్యాయాధికారి తీర్పు చెప్పాడు. ఈ తీర్పుతో దేవదత్తుడు సంతోషపడలేదు. వెంటనే న్యాయాధికారి ఒక పీటను తెప్పించి దానిమీద హంసను ఉంచమన్నాడు. గౌతముణ్ణి, దేవదత్తుణ్ణి విడివిడిగా హంసను పిలువమన్నాడు. అది ఎవరి దగ్గరకు పొతే అది వారిది అవుతుందని చెప్పాడు. మొదట దేవదత్తుడు హంసను పిలిచాడు. 
          అతని కోపపు చూపుకు, కఠినమైన పిలుపుకు హంస రాలేదు. గౌతముడు ఆప్యాయంగా హంసను పిలవగానే ఆ హంస అతని ప్రేమపూర్వకమైన పలుకులకు ఎగిరి వచ్చి, చేతిపైన వాలింది. గౌతముని అహింసా పద్దతికి సభలోని వారంతా చప్పట్లు కొట్టారు. రాజు న్యాయాధికారి సంతోషించారు. 

ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏమనగా కాఠిన్యం కంటే ప్రేమ, దయ ఉన్నవాళ్లకే అందరి మన్నన దొరుకుతుంది అని.

కామెంట్‌లు