Methods of drinking water Part-1



ఆరోగ్యంగా ఉండడానికి నీరు త్రాగే విధానం 
Methods of drinking water Part-1





water...
 
          వాగ్భాటాచార్యులు అంటారు ఆహరం తీసుకోవడం ముఖ్యంకాదు ముందు ఆ ఆహరం అరగడం ముఖ్యమని. ఎందుకంటే అది అరిగినప్పుడే రసంగా మారి మజ్జా, రక్తము, వీర్యం, మేధా, మలం, మూత్రం ఇలా తయారవుతుంది. దాంతోటె మన పెరుగుదలకు మన జీవితం నడవడానికి కారణమవుతుంది. అందుకు తినడం ఎంత ప్రధానమో తిన్న ఆహరం సక్రమంగా జీర్ణమవడం కూడా అంత ముఖ్యం. 

          భోజనాంతే విషం వారీ.  
అని వాగ్భాటాచార్యులు చెప్పారు తన ఆయుర్వేదశాస్త్రంలో. అంటే భోజనం చేసాక నీళ్ళు తాగడం విషంతో సమానం అని. మన జీర్ణాశయములో ఉన్న జఠరాగ్ని ప్రజ్వలినప్పుడే మనకు ఆకలి కలుగుతుంది. మనం తీసుకున్న ఆహారాన్ని అరిగించడానికి కావాల్సిన అగ్నిని పుట్టిస్తుంది. మీరెప్పుడైనా నోట్లో ఆహరం పెట్టుకోగానే మొదటగా నోట్లో నీళ్లు ఉరీ ఆ తరువాత జీర్ణాశయంలోని జఠరాగ్ని ప్రజ్వలన మొదలవుతుంది. ఆ జఠరాగ్ని తోనే మీరు తిన్న ఆహరం అరిగి రసంగా మారుతుంది. అలా మీరు తింటున్న ఆహారంను ఆ జఠరాగ్ని అరిగించే ప్రక్రియలో ఉండగా అప్పుడు మీరు మధ్యలో నీళ్ళు తాగితే ఏమవుతుంది? ఆ అగ్ని కాస్త శాంతించబడుతుంది. ఎందుకంటే ఏదైనా వేడిగా ఉన్న దానిపై నీళ్ళు పోయగానే చల్లబడుతుంది కదా! అలానే జఠరాగ్ని ప్రజ్వలిస్తున్నప్పుడు దానిపై నీళ్ళు పోయటం వలన ఆ ప్రజ్వలన శాంతిస్తుంది. కొందరు భోజనం అవ్వగానే గ్లాసెడు గ్లాసెడు నీళ్ళు త్రాగుతుంటారు. మరికొందరు భోజనం అవ్వగానే చెంబేడు నీళ్ళు అలా ఎత్తి ఖాళీ చేస్తారు. ఇలా త్రాగటం ద్వారా తిన్న ఆహరం జీర్ణమయ్యే ప్రక్రియకు అంతరాయం ఏర్పడుతుంది. దాని వల్ల ఆహరం అరగకుండా అలా ఉండిపోతుంది. ఇలా తిన్న ఆహరం అరగకుండా ఉండిపోవడం వలన గ్యాస్ పుడుతుంది. ఇలా గ్యాస్ రావడం ప్రారంభమైతే ఇగ మీ జీవితంలోని ప్రతి సమస్యకు ఈ గ్యాస్ కారణం అవుతుంది. ఈ గ్యాస్ తీవ్రత పెరుగుతే ఛాతిలో నొప్పి, గొంతులోనొప్పి, వీపులోనొప్పి, కడుపులోనొప్పి మొదలవుతుంది. ఈ గ్యాస్ శరీరం మొత్తం తిరుగుతుంది కూడా. దీనితో తలనొప్పి, కండ్లు తిరగడం, గుండెల్లో నొప్పి వస్తుంది. ఇలా భోజనం తర్వాత నీళ్ళు త్రాగడం వలన 103 రకాల జబ్బులకు దారితీస్తుంది అంటారు వాగ్భాటాచార్యులు. అందులో ముఖ్యంగా మొదటిది ఎసిడిటి వస్తుంది. ఆ ఎసిడిటియే హైపర్ ఎసిడిటిగా మారుతుంది. ఇంకా అలానే నీళ్ళు త్రాగుతుంటే అది అల్సర్, పెప్టిక్ అల్సర్, అర్శమొలలు, మూలవ్యాధి, భగంధర్ గా మారి చిట్టచివరికి క్యాన్సర్ కు కూడా రూపాంతరం చెందుతుంది. ఇంకో విషయం తిన్న ఆహరం సరిగా అరగకపోవడం వల్లనే చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఎప్పుడైతే ఆహరం తిన్నది అరుగుతుందో అప్పుడు శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ఉండదు. కొలెస్ట్రాల్ లు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి HDL, రెండవది LDL, ఇంకా ఈ LDL లో VLDL అని కూడా ఉంటుంది. HDL అనగా High-density lipoproteins అని అంటారు. ఈ HDL కొలెస్ట్రాల్ మనకు మంచిది, దీన్నే మంచి కొలెస్ట్రాల్ అంటారు. ఇగ LDL అనగా Low-density lipoproteins అని అలాగే VLDL అనగా Very-Low-density lipoproteins అని అంటారు. ఈ LDL, VLDL కొలెస్ట్రాల్ మనకు ఎంతో చెడును కలిగిస్తుంది, అందుకు దీన్ని చేదు కొలెస్ట్రాల్ అంటారు. ఇలా భోజనం మధ్యలో మరియు భోజనం చేసిన వెంటనే గట గట నీళ్ళు త్రాగుతుండే వాళ్లకు ఈ చెడు కొలెస్ట్రాల్ పెరగడం ఒక కారణం అవుతుంది. ఎవరికైనా కొలస్ట్రాల్ పెరుగుతుందంటే మీకు మీరుగా గమనించుకొండి మీరు తినే ఆహరం అరుగుతుందా? లేదా అని! ఆహరం అరగటం లేదు అంటే మీరు నీళ్ళను భోజనంతోపాటు తీసుకుంటున్నారా లేదా అనేది గమనించుకొండి. 

          మరి అలా అయితే నీళ్ళను ఎప్పుడు త్రాగాలి అని ప్రశ్న రావచ్చు!

వాగ్భాటాచార్యులు ఆయుర్వేద శాస్త్రంలో చెప్పారు కనీసానికి కనీసం భోజనం చేసిన గంటన్నర తర్వాత నీళ్ళు త్రాగాలి అని. ఎందుకంటే తిన్న ఆహరం గంటన్నర వరకు జఠరాగ్ని ప్రభావంతో ఉండి అది రసంగా మార్చబడుతుంది. ఈ సమయం అనేది ఒక్కొక్క స్థల వాతావరణాన్ని బట్టి ఉంటుంది. అదే భారతదేశంలోని ఉత్తరం వైపు వారికీ, కొండల ప్రాంతాల వారికీ ఈ సమయం రెండు నుంచి రెండున్నర గంటల వరకు ఉంటుంది. అదే మనకు దక్షిణం వైపు వారికీ మాత్రం ఈ సమయం గంట నుండి గంటన్నర వరకు ఉంటుంది. అందుకని మనం భోజనం చేసిన గంటన్నర వరకు నీళ్ళు త్రాగకూడదు. 

          మరి అలా అయితే భోజనానికి ముందు త్రాగవచ్చా అనే ప్రశ్న ఉదయిస్తుంది మీ మనస్సులో! 

          దీనికి వాగ్భాటాచార్యులు ఏమి చెప్పారంటే... భోజనానికి 40 నిమిషాల నుండి ఒక గంట ముందు నీళ్ళు త్రాగవచ్చు అని. అలా అయితే భోజనం చేస్తున్నప్పుడు ఎప్పుడైనా గొంతులో ఇబ్బంది, ఏదైనా గొంతులో తట్టుకున్నప్పుడు మరియు ఎక్కిళ్లు, తుమ్ములు వచ్చినప్పుడు ఎలా మరి అనే సందేహం కలుగుతుంది కదా! దానికి వారు ఏమి చెప్పారంటే ... అలా మీకు భోజనం చేస్తున్నప్పుడు ఇబ్బంది కలుగుతే మాత్రం కొద్దిగా నీళ్ళు త్రాగవచ్చు. కొద్దిగా అంటే రెండు లేక మూడు గుటకలు మించకుండా మాత్రమే త్రాగాలి. 

          అలాగే భోజనంలో రెండు రకాల అన్నాలను తీసుకుంటున్నప్పుడు, అనగా... ఈ మధ్యకాలంలో చాలా మంది చపాతీలు, రొట్టెలు, వరి అన్నం కలిపి తీసుకుంటున్నారు. ఏమి అంటే ఆరోగ్యానికి మంచిది అని. ఇలా తీసుకునేటప్పుడు మీరు ఒక అన్నానికి ఇంకో అన్నానికి మధ్యన కొద్దిగా నీళ్ళు త్రాగాలి, ఇది ఎంతో ముఖ్యం కూడా. మనం ఆహారంగా తీసుకునే దేనినైనా అన్నం అనే అంటారు. ఇక్కడ చపాతీని గోధుమలతో, రొట్టెను జొన్నలతో, వరి అన్నంను బియ్యంతో చేస్తారు. ఇవి అన్ని అన్నాలె, కానీ వేరువేరు అన్నాలు. కావున ఒక రకమైన అన్నం తిన్నాకా ఇంకో రకమైన అన్నం తినేముందు నీళ్ళు ఖచ్చితంగా త్రాగాలి. అది కూడా రెండు లేక మూడు గుటకలు మాత్రమే. 

          ఎందుకు అనగా ఇలా వీటి మధ్యలో నీళ్ళు త్రాగటం వల్లన ఈ నీళ్ళు వెళ్ళి ఆ రెండు వేర్వేరు రకాలైన అన్నముల మధ్య బాండింగ్ను పెంచుతుంది. దీనితో తిన్న ఆహరం సరిగా జీర్ణమవుతుంది. ఇలా రెండు వేర్వేరు రకాలైన అన్నములను తీసుకున్నపుడు వాటి మధ్యన నీళ్ళు త్రాగకపోయేసరికి తీసుకున్న ఆహరంలో ఒకదానికి ఇంకోదానికి బాండింగ్ లేక జీర్ణక్రియకు ఆటంకం ఏర్పడి సరిగా జీర్ణమవ్వక దానితో ఏదైతే ఆరోగ్యం కోసం తింటున్నారో అది కలుగకపోగా తిరిగి దుష్ఫలితాలు ఏర్పడుతాయి. అందుకని భోజనం చేస్తున్నపుడు మధ్యలో ఇబ్బంది కలిగినప్పుడు మరియు వేర్వేరు రకాలైన అన్నముల మధ్యలో మాత్రమే అదీనూ రెండు లేక మూడు గుటకలు నీళ్ళు త్రాగవచ్చును. ఆ తరువాత భోజనం చేసిన గంటన్నర వరకు నీళ్ళు త్రాగకూడదు. ఒకవేళ భోజనం చేసాక గొంతును శుభ్రం చేసుకోవాలి అనుకుంటే మాత్రమే రెండు లేక మూడు గుటకల నీళ్ళతో శుభ్రం చేసుకోవడానికి త్రాగాలి. 

          మరి నీళ్ళు త్రాగదంటున్నారు, భోజనం చేసిన తరువాత ఒకవేళ దప్పికగా అనిపిస్తే ఎలా? నీళ్ళు కాక ఇంకేమైనా ఉన్నాయా అనే సందేహం కలగవచ్చు మీకు.

          నీళ్ళు కాక అత్యంత శ్రేష్టమైనవి మూడు ఉన్నాయి భోజనం తరువాత త్రాగవలిసినవి. అవి ఏమిటంటే ఒకటి మజ్జిగా, రెండవది పాలు, ఇగ చివరిది పండ్ల రసాలు. మళ్ళి ఇందులో కూడా ఒక నియమం ఉంది. అది ఏమిటంటే వీటిని ఏ ఏ సమయంలో తీసుకోవాలి అని!

          అతి శ్రేష్టమైన మజ్జిగను ఎప్పుడు తీసుకోవాలంటే మధ్యాహ్న భోజనం తరువాత. ఈ మజ్జిగ కూడా వెన్న తీసినది అయివుండాలి. లస్సిని త్రాగకూడదు, ఎందుకంటే అందులో వెన్న ఉంటుంది. కాబట్టి అందుకు మీరు ఎప్పుడు మధ్యాహ్న భోజనం తరువాత త్రాగవలసినది వెన్న తీసిన మజ్జిగ. 

          అలాగే రాత్రి భోజనానంతరం శ్రేష్టమైనది పాలు. ఈ పాలు, మరియు మజ్జిగ కూడా మన దేశీ ఆవు పాలు, దేశీ ఆవు పాలుతో చేసిన మజ్జిగ అయితేనే శ్రేష్టం. అదే jersey, holstein మరియు H.F ఆవుల పాలు హానిని కల్గిస్తాయి. ఎందుకంటే ఈ ఆవులు A1 పాలు ఇస్తాయి అదే మన దేశీ ఆవు A2 పాలు ఇస్తుంది. మనకు ఈ A2 పాలు మేలు చేస్తాయి. ఈ విషయమై త్వరలో వివరంగా ఒక పోస్ట్ ను మీ ముందుకు తెస్తాను. 

          ఇగ పండ్లరసాల దగ్గరకు వస్తే ఉదయం భోజనానంతరం శ్రేష్టమైనది. ఈ పండ్లరసాలు అనేది కూడా ఏ ఏ ఋతువుల్లో లభించే ఆ ఆ పండ్ల రసాలు అయివుండాలి. అలాకాక ఆ ఋతువుల్లో దొరకని పండ్ల రసాలు త్రాగకూడదు. ఇలా త్రాగడం వలన మన ఆరోగ్యానికే హానికరం. ఎందుకంటే మన శరీరానికి ఏ ఏ ఋతువుల్లో ఏమేమి కావాలో దానిని ఈ ప్రకృతి కొన్ని రకాల పండ్ల ద్వారా అందిస్తుంది. మిగతా పండ్ల అవసరం ఎప్పుడో అప్పుడే ఈ ప్రకృతి అందిస్తుంది. అంతేగాని పండ్లు మంచివని ఆ ఋతువుల్లో కాయని పండ్లను తినకూడదు. అలా తినడం మనకే హాని. ఇప్పుడున్న పరిస్థితిలో పండ్ల డిమాండ్ బాగుందని కొన్ని కంపెనీలు రసాయనాలతో పండ్లను, పండ్ల రసాలను శుద్ధిచేసి కోల్డ్ స్టోరేజ్ లో ఉంచి సంవత్సరానికి 365 రోజులు అందిస్తున్నారు. ఇలా వీటిని సేవించడం మనకే ప్రమాదం. కావున ఉదయం భోజనానంతరం ఆ ఆ ఋతువుల్లో కాసే తాజా పండ్ల రసాలను త్రాగడం శ్రేష్టం. 

          ఈ క్రమాన్ని అటు ఇటు, ఇటు అటుగా మార్చకండి. ఎందుకంటే మజ్జిగను రాత్రి పూట, పాలను మధ్యాహ్నం లేక ఉదయం తీసుకోకూడదు. ఎందుకంటే వాటిని అరిగించే ఎంజైములు ఆ సమయంలోనే ఉంటాయి. కాబట్టి పండ్ల రసాలను ఉదయం భోజనానంతరం, మజ్జిగను మధ్యాహ్న భోజనానంతరం, పాలను రాత్రి భోజనానంతరం త్రాగండి. (ఇంకా ఈ మజ్జిగా మరియు  పాలను ఆ సమయంలోనే ఎందుకు తీసుకొవాలి అనే విషయమై పూర్తిగా సంక్షిప్తంగా తెలుసుకోవాలనుకుంటే, ఇంతకూ పూర్వమే వెలువడిన Full detail information about curd అనె లింక్ ను క్లిక్ చేయండి).

          అందరికి ఒక అలవాటు ఉంటుంది ఏంటంటే పిల్లలకు ప్రొద్దునపూట పాలు త్రాగించి స్కూల్ కు పంపిస్తారు. ఇక మీదట అలా చేయకండి. ఉదయం పాలకు బదులు పండ్లు లేక పండ్ల రసాలు ఇవ్వండి, సూర్యాస్తమయం తర్వాత పాలు త్రాగించండి. సూర్యాస్తమయం అయిన తర్వాత మజ్జిగ ఇవ్వకండి, మీరు కూడా అలానే పాటించండి మేలు జరుగుతుంది. 

ఇంకా ఉంది...

          తర్వాత భాగం పార్ట్-2లో ఇంకా కొన్ని విషయాలను క్లుప్తంగా తెలుసుకుందాం. 

ఈ article యొక్క వీడియో చూడండి. 

మరిన్ని వీడియోల కోసం KUSUMA Creations Youtube Channel ను Subscribe చేసుకోండి. 

KUSUMA Creations YouTube channel is a part of Bharatsahajavaani.
 
KUSUMA Creations YouTube channel is an online Bharat Sahaja Vaani of Dhamma Marg education platform, specialized in what is the dharma, Spiritual Gurus introduction, Spiritual right path and Health tips 



భవతు సర్వ మంగళం


కామెంట్‌లు