శ్రీ విధ్యారణ్య స్వామి
Sri Vidhyaranya Swami
అలాంటి వేదం చదవాలంటే ఎలా? అది సంస్కృతంలో ఉంటుంది, ఎలా తెలుసుకునేది...?
వేదంను చదివేవాళ్ళు ఎంతమంది ఈ కాలంలో ఉన్నది అంటే ఏ వందో, వెయ్యిల్లో ఉంటారు. కానీ సంస్కృతం రానివాళ్ళం కోట్లల్లో ఉన్నాం. మరి ఇది ఎలా సాధ్యం వేదం తెలుసుకోవాలంటే? దీనికి... ఎన్నో సంవత్సరాల పూర్వమే ఈ పరిస్థితిని దూరదృష్టితో చూసి అప్పటి సమాజం కూడా ఇలాంటి పరిస్థితిలోకి కూరుకుపోతున్న సమయంలో ఈ ధర్మమును తెలుపడానికి అందరికి అర్ధమయ్యేలా వేదాలకు భాష్యం అందించిన మొట్టమొదటి మహనీయుడు వారు.
ఆ కాలంలో ధర్మం ప్రజలలో పట్టు వీడిపోతూ... ఇతర మతాల ప్రభావం ఎక్కువై... జీవించాలంటే వారి మతంను స్వీకరించాలి లేకపోతె ప్రాణం వదలాలి అనే తీరుగా ఉన్న కాలంలో ధర్మ రక్షణకై హిందుత్వంను కాపాడేందుకు... ఆ హిందుత్వంతో ఈ దేశం ప్రజ్వలిల్లాలని విజయనగర సామ్రాజ్య స్థాపనకు మూలపురుషుడు వారు.
ఈనాడు ఈ ఇంత హిందుత్వం మిగిలి ఉంది అంటే ఆనాడు ఆ విజయనగర సామ్రాజ్య పాలనా కూడా ఒక కారణం. దాదాపుగా 300 సంవత్సరాలు విజయనగర సామ్రాజ్యం దక్షిణ భారత దేశం మొత్తంగా ఉండింది. అంతటి సామ్రాజ్య స్థాపన ద్వారా హిందుత్వంను తిరిగి నిలబెట్టినారు. దేశం మొత్తం బుద్ధ భగవానుడు స్థాపించిన ధర్మం శంకరాచార్యుల కాలానికి వచ్చేసరికి లక్ష్యం తప్పింది. దాన్ని సరిచేసి హిందుత్వంను తిరిగి నిర్మించారు శంకరాచార్యులు. దానికోసం దేశంలో 4 మఠాలను ఏర్పరిచారు. వాటిలోని ఒకటైన శారదా పీఠానికి 12 వ పీఠాధిపతిని అధిరోహించి, హిందుత్వంను ఈ కాలంలో ప్రజల వద్దకు చేర్చాలంటే ఇంకకొన్ని మఠాలు అవసరమని తలచి, కొన్ని మఠాలను స్థాపించినారు, అంతేకాక ఎన్నో గ్రంధాలు, కావ్యాలు రచించి, శంకరాచార్యుల తర్వాత అంతటి ధర్మస్థాపన కోసం పాటుపడి, శంకరాచార్యుల తర్వాత శంకరాచార్యలంతటి వారీగా కీర్తింపబడిన కారణజన్ముడు వారు, అంతేకాక వీరు మన వరంగల్ ప్రాంత వాసులు కూడా, అంతటి మహనీయుడైన శ్రీ శ్రీ శ్రీ విద్యారణ్య స్వామి వారి గురించి ఈ రోజు ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.
శ్రీ విద్యారణ్య స్వామి జననం, బాల్యం
ఆనాటి కాకతీయ సామ్రాజ్య ఓరుగల్లు, అదే ఇప్పటి వరంగల్ లో ఒక పేద నియోగి బ్రాహ్మణ కుటుంబంలో మాయణాచార్యులు మరియు శ్రీమతి దేవి అనే దంపతులకు 1296 వ సంవత్సరంలో ఏప్రిల్ 11 న జన్మించారు. విద్యారణ్య స్వామికి తల్లిదండ్రులు పెట్టిన పేరు మాధవర్య.
మాధవర్య తండ్రిగారు మహా గొప్ప వేద పండితుడు. కావున మాధవర్య, అతని తమ్ముడు మొదట తమ తండ్రి దగ్గరే విధ్యను అభ్యసించారు. ఆ తరువాత మాధవర్య తమ్ముడు జ్ఞానార్జన కోసం దేశాటన చేస్తూ శృంగేరి చేరుకుంటాడు. అప్పటి శృంగేరీ పీఠాధిపతి అయిన విద్యాశంకర తీర్ధస్వామి ఆ బాలకునిలో ఉండే ఆధ్యాత్మిక భావానికి ముచ్చటపడి అతనిలో ఉన్న ప్రతిభను గుర్తించి ఆ బాలుడికి సన్యాసం ఇస్తాడు. సన్యాసం ఇచ్చాక ఆ బాలుని పేరుని భారతీకృష్ణ తీర్ధస్వామిగా మారుస్తారు.
శ్రీ విద్యారణ్య స్వామి సన్యాస దీక్ష
ఇది ఇలా ఉండగా తన తమ్మున్ని వెదుక్కుంటూ మాధవర్య కూడా శృంగేరి చేరుకుంటాడు. తన తమ్ముడు సన్యాసం తీసుకోవడం, భారతీకృష్ణ తీర్ధగా మారడం తెలుసుకొని, తాను కూడా సన్యాసం తీసుకోవాలని నిర్ణయించుకుంటాడు. అప్పుడు అతని తమ్ముడైన భారతీకృష్ణ తీర్ధ తన గురువైన విద్యాశంకర తీర్ధ స్వామిని ఒప్పించి మాధవర్యకు సన్యాసం ఇప్పిస్తాడు. విద్యాశంకర తీర్ధస్వామి మాధవర్యకు 1331 సంవత్సరంలో సన్యాసం ఇచ్చి విద్యారణ్య అని నామకరణం చేసారు. విద్యారణ్య అనగా అరణ్యం వంటి జ్ఞానం కలవాడు అని అర్ధం.సన్యాసం తీసుకున్నాక విద్యారణ్య స్వామి కాశీకి వెళతాడు. అక్కడ నుండి వేదవ్యాసుల మార్గదర్శకత్వములో బదరికాశ్రమానికి వెళ్ళి అక్కడ 'శ్రీ విద్య' ను గ్రహించారు. ఉత్తర భారత యాత్ర పూర్తీ చేసుకొని తిరిగి దక్షిణ భారత దేశానికి వచ్చి హంపి సమీపంలో ఉన్న మాతంగ పర్వతం వద్ద యోగ నిష్టలో కొంత కాలం గడిపారు.
కాకతీయ సామ్రాజ్య చివరిదశ
ఇలా ఉండగా కొద్ది సంవత్సరాల పూర్వం నుండి అప్పటి కాకతీయ సామ్రాజ్యంపై ఢిల్లీ సుల్తానులు పదే పదే దండయాత్రలు చేస్తూవచ్చారు. చివరికి కాకతీయుల సామ్రాజ్యంలోని కుల భావాల వల్ల 1323 వ సంవత్సరంలో కాకతీయ సామ్రాజ్యం ఢిల్లీ సుల్తాను మహమ్మద్ బిన్ తుగ్లక్ చేతిలో ఓటమి ఎదుర్కొంది.దీనితో కాకతీయ సామ్రాజ్య కీర్తి క్షిణించింది. తరువాత తిరిగి సామ్రాజ్యాన్ని నిలబెట్టడానికి సామంత రాజులు ఎంత శ్రమించిన విఫలురయ్యారు. ఎందుకంటే... కాకతీయ సామ్రాజ్యం పడిపోయాక ఢిల్లీ సుల్తాను చుట్టూ ఉన్నా... మరియు అభివృద్ధి చెందుతున్న హిందూ రాజ్యాలపై తిరుగుబాట్లు చేస్తూ, అచ్చట హిందుత్వం అనేది కనిపించకుండా ఉండేవిధంగా రాజ్యాలను నాశనం చేశారు. అందులోని భాగంగా ఆ రాజ్యప్రజల్ని మతమార్పిడి, అణిచివేత, హత్య, అల్లకల్లోలం, అత్యాచారం, హిందూ దేవాలయాల నాశనం, పవిత్ర స్థలాల్ని గ్రంథాలను ధ్వంసం చేయటం లాంటి ఎన్నో అకృత్యాలకు పాల్పడినారు.
హరిహర రాయులు, బుక్క రాయులు
అలాంటి పరిస్థితిలో కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుని వద్ద కోశాధికారులుగా ఉన్న హరిహర రాయులు మరియు ఇతని తమ్ముడు బుక్క రాయులు ఓరుగల్లు పతనం తరువాత 'కంపిలికి' పోయి 'అనగొంది' సంస్థానంలో మంత్రులుగా చేరి. 1326 వ సంవత్సరంలో ఢిల్లీ సుల్తాను మహమ్మద్ బిన్ తుగ్లక్ ను ఎదుర్కొని యుద్ధం చేస్తారు. ఆ యుద్ధంలో అనగొంది సంస్థానం రాజు చనిపోతారు. దాంతో ఢిల్లీ సుల్తాను మహమ్మద్ బిన్ తుగ్లక్ ఆ రాజు యొక్క ఇద్దరు మంత్రులు అయిన హరిహర, బుక్క రాయులను ఖైదీలుగా చేసి ఢిల్లీకి తీసుకువెళ్తాడు.దారిలో భయంకరమైన గాలిదుమారం వచ్చి సైనికులు, బందీలు చెల్లా చెదురయ్యారు. కానీ సోదరులిద్దరూ మాత్రం పారిపోక ఒక చెట్టు కింద కూర్చొని ఉండగా... సుల్తాన్ గమనించి వారిని ప్రశ్నించగా వారిచ్చిన సమాధానానికి సంతోషపడి వారికీ ఢిల్లీ దర్భారులో స్దాన మిచ్చాడు. ఆ తరువాత ఇక్కడ కంపిలిలో 'మాలిక్ నయిబ్ ' పట్ల వ్యతిరేకత పెల్లుబికి రాజ్యం చేజారిపోతున్న సమయంలో విప్లవాన్ని అణిచివేయడానికి 'తుగ్లక్' హరిహర, బుక్క రాయలను తిరిగి పంపుతాడు. వీరిరువురు దక్షిణ భారతదేశంకు తిరిగి వచ్చి కంపిలిని స్వాధీనపరచుకొని ఇదే అనువైన సమయం అని తమకు తాము స్వతంత్రులుగా ప్రకటించుకుంటారు.
ఒకనాడు వీరిరువురు మాతంగ పర్వతానికి వెళతారు. అక్కడ యోగనిష్ఠలో తపస్సు చేసుకుంటున్న విద్యారణ్యతో పరిచయం ఏర్పడుతుంది. అతని ప్రకాశవంతమైన ముఖ తేజస్సుకు వారు ప్రభావితం అయ్యి... దక్షిణ భారతదేశంలో జరుగుతున్న అకృత్యాలు మరియు వారి గురించి విద్యారణ్యకు విన్నవించుకుంటారు. దక్షిణ భారతదేశంలో ముస్లిం పాలకుల నుండి మరియు వారి దూకుడు నుండి హిందుత్వాన్ని రక్షించాల్సిన అవసరం ఉందని విద్యారణ్య స్వామి గ్రహించి.. ఆ ఇద్దరి సోదరులను ఒక నగరాన్ని నిర్మించటానికి మరియు ఒక నిర్దిష్ట ప్రదేశంలో హిందూ రాజ్యాన్ని స్థాపించడానికి ప్రేరేపించారు. అలాగే రాబోయే సంవత్సరాలలో ముస్లిం దండయాత్రలను మరియు హింసలను తట్టుకునే సామ్రాజ్యాన్ని నిర్మించడానికి కావాల్సిన మార్గనిర్ధేశం చేసి, తుంగభద్రా నదికి కుడివైపు అనువైనదని సూచించి ఆశీర్వదించారు.
విజయనగర సామ్రాజ్య స్థాపన
ఆ తరువాత వారు సామ్రాజ్యాన్ని తుంగభద్రా నదికి ఎడమవైపుకు కూడా విస్తరింపజేసి విద్యారణ్యుని గౌరవార్దంగా రాజధానికి విధ్యానగరం అని పేరు పెట్టారు. విద్యారణ్య స్వామి వారికోసం హంపినగర రూపానికీ 'శ్రీ చక్రం' ఆధారంగా ప్రణాళిక తయారుచేసారు. నగర మధ్యలో విరూపాక్ష దేవాలయం ఉండేలాగా, కోటకు 9 గుమ్మాలతో నగరాన్ని నిర్మించారు. ఆ సామ్రాజ్యానికి రాజధాని పేరు క్రమ క్రమంగా విజయనగరం గా మారింది. విజయనగరం అంటే విజయాన్ని ప్రసాదించే నగరం అని అర్ధం. క్రీ. శ. 1336 రాగి ఫలకం ఆధారంగా "విద్యారణ్య స్వామి ఆధ్వర్యములో హరిహర రాయులు సింహాసనం అధిష్టించాడు" అని తెలుస్తుంది. ఆ తరువాత 1356 లో బుక్క రాయలను రాజుగా చేసారు.విద్యారణ్య స్వామి రాజ్యం ఏర్పడిన తరువాత కూడా ముస్లిం దండయాత్రలు దరిదాపుల్లో రాకుండా, హిందుత్వం పునర్జీవం పోసుకొని, పటిష్టమవ్వడానికి, రాజ్యం నలుదిశలా కీర్తిని పొందేలా మార్గనిర్ధేషులుగా ఉన్నారు. అలా అతని ప్రేరణ ద్వారా స్థాపించబడిన విజయ నగర సామ్రాజ్యం దాదాపు 300 సంవత్సరాలు ముస్లిం దాడులను తట్టుకొని హిందుత్వంను కాపాడుకుంటూ.. నలుదిశలా వ్యాపించేలా విజయకేతనం ఎగరవేసింది. ఆ విజయనగర రాజులలో ఒకరైన 'శ్రీకృష్ణదేవరాయలవారు'. వీరి కాలంలో మరింతగా హిందుత్వ విజయకేతనం రెపరెపలాడింది. ఆ కాలంలోనే మన తెలుగు సంస్కృతి కూడా వృద్ధి చెందింది. ఎన్నో గ్రంథాలు, కావ్యాలు రచించబడినాయి. దేవాలయాల పునరుద్ధరణలు జరిగాయి, ఆర్ధిక బలం, ఇలా అన్ని రంగాల్లో విజయకేతనం ఎగరవేసింది. ఆనాడు విద్యారణ్య స్వామి తన యోగాశక్తి అంత ఉపయోగించి హిందుత్వంను నిలబెట్టడానికి ఒక ప్రణాళిక పద్దతిలో మార్గనిర్దశం చేస్తూ ఈ దక్షిణ భారతాన్ని తిరిగి తన హిందుత్వంలో వెలుగొందేలా శ్రమించిన మహోన్నత వ్యక్తి.
ఇలా విద్యారణ్య స్వామి విజయనగర సామ్రాజ్యానికి మార్గనిర్ధేషులుగా ఉంటూ తమ ఆధ్యాత్మిక సాధనలకోసం కాశీ, బదరి వంటి ప్రదేశాలలో తపస్సుకై వెళుతూవస్తుండేవారు. అలా వెళ్ళినప్పుడు ఇక్కడి విషయాలను తమ యోగ శక్తితో తెలుసుకొని ఇక్కడి వీరికి మార్గనిర్ధేశం ఇస్తుండేవారు. ఒకసారి విద్యారణ్య స్వామి కాశీ నుండి శృంగేరికి తిరిగి వస్తూ హంపిలో బస చేసారు. అప్పుడు బుక్క రాయలు విద్యారణ్య స్వామి తో పాటు ఉండి అక్కడ వారికోసం విరూపాక్ష దేవాలయానికి ప్రక్కన మఠాన్ని ఏర్పాటు చేసాడు. ఆ తరువాత 1372 లో తమ శిష్యులైన మయన కుమారులు... 'మాధవ, సాయనలను' బుక్క రాయల ఆస్థానంలో మంత్రులుగా నియమించి తిరిగి కాశీ కి వెళ్ళి తమ ఆధ్యాత్మిక కార్యకలాపాలలో దృష్టి పెట్టారు.
శ్రీ విద్యారణ్య స్వామి రచనలు
ఈ మాధవ, సాయనలు కూడా విద్యారణ్య స్వామి మాతంగ పర్వతం వద్ద తపస్సు చేసుకుంటున్న కాలంలో దర్శించుకొని, వారి వద్ద జ్ఞానం పొందినవారు. అప్పుడు విద్యారణ్య స్వామి.. తాను అసంపూర్తిగా రచించి వదిలిపెట్టిన వేద భాష్యాలను పూర్తీ చేయమని, అలాగే ఆ వేద భాష్యాలకు వారి పేర్లే పెట్టమని చెబుతాడు. ఆ విధంగా అవి సాయనీయం, మాధవీయం అని ప్రాచుర్యంలోకి వచ్చాయి. పండితుల వరకే పరిమితమైపోతున్న వేదాన్ని మాములు జనాల వద్దకు కూడా చేర్చాలనే ఉద్దేశ్యంతో వేదాలకు భాష్యం రాసిన మొట్ట మొదటి వారు శ్రీ విద్యారణ్య స్వామి వారు.
ఒక్క వేద భాష్యాలే కాకా., వేదవ్యాసుని మార్గంలో సమస్త విద్యలను అభ్యసించిన శ్రీ విద్యారణ్య స్వామి వేదాలపై, ఉపనిషత్తులపై, జీవన విధానాలపై, రాజనితులపై, లౌకిక విషయాలపై, ప్రక్రుతి కాలాలపై, సంగీత శాస్త్రాలపై, శిల్పకళా శాస్త్రాలపై, ఖగోళ శాస్త్రాలపై ఎన్నో గ్రంథాలు దాదాపుగా 1800 లకు పైగా రచించారు. కానీ అవి అన్ని ఇప్పుడు లభ్యం కావటంలేదు. విజయనగరం పతనం అయినతరువాత శత్రువులు వీటిని ధ్వంసం చేస్తారని వీటిని గుహల్లో, భూగర్భంలో దాచిపెట్టారని చెప్తారు. కానీ ఇప్పటికి మనకు కేవలం 70 గ్రంథాలు వరకే అందుబాటులో ఉన్నాయి. వాటిలో కొన్ని... ధాతువృత్తి, జీవన్ముక్తి వివేకం, వేదాంత పంచదశి, బృహదారణ్యక వార్తికాసారం, ఐతరేయ, తైత్తిరీయ ఉపనిషద్దీపిక, శంకరుల అపరోక్షానుభూతి దీపిక, అనుభూతి ప్రకాశిక, మనోనాస ప్రకరణ, పురుషార్థ సుధానిది, సంగీత సారం, దృగ్దృశ్య వివేకం, వివారణ ప్రమేయ సంగ్రహం, శంకర దిగ్వజం వంటి గ్రంధాలు మరియు తమ గురువైన విద్యాశంకర స్వామి పై, కాల నిర్ణయాల మీద కూడా గ్రంధాలు రాసారు, ఇలా ఎన్నో రచించి ఆది శంకరాచార్య తరువాత అద్వైత వాజ్మయ సాహిత్యంలో ప్రముఖులయ్యారు.
విద్యారణ్య స్వామి గురువుగారైన విద్యాశంకరా స్వామి సమాధిలోకి వెళ్ళిపోయాక తన కంటే ముందు సన్యాసం తీసుకున్న తన తమ్ముడైన భారతీకృష్ణ తీర్ధ స్వామి శృంగేరి మఠ పీఠం అధిరోహించి, 1333 నుండి 1380 వరకు పీఠాధిపతిగా ఉన్నారు. భారతీకృష్ణ తీర్ధ స్వామి తమ గురువు జ్ఞాపకార్ధం ఒక దేవాలయాన్ని నిర్మిస్తాడు 1338 వ సంవత్సరంలో. ఆ తరువాత తిరిగి ఆ దేవాలయాన్ని 1357-58 మధ్య కాలంలో విద్యారణ్య స్వామి వారు ఆ దేవాలయాన్ని పూర్తిచేసారు.
శ్రీ విద్యారణ్యుడి ఖగోళ మరియు శిల్పకళా...
విద్యారణ్య స్వామి శిల్పకళా శాస్త్ర పారంగతుడు కావున విజయనగరాన్ని శ్రీ చక్రం రూపంలా మధ్యలో విరూపాక్ష దేవాలయం ఉండేటట్లు నిర్మింపచేసారు. విజయనగర సామ్రాజ్య పతనం తరువాత శత్రుసైన్యం ఆ రాజ్యాన్ని ధ్వంసం చేసినా ఇప్పటికి అక్కడి శిల్పకళా.. మనస్సును కట్టిపడేస్తుంది. అంతటి శిల్పకళా నైపుణ్యం చూపెట్టారు. అలాగే తన గురువు గారి దేవాలయానికి కూడా శిల్పకళ తో పాటు దానికి ఖగోళ శాస్త్రం జోడించి దేవాలయాన్ని పూర్తిచేశారు. ఆ దేవాలయం కట్టిన టెక్నాలజీ ఇప్పటికి ఈనాటి శాస్త్రవేత్తలకు మిస్టరీ గానే ఉంది. అది ఏంటంటే....
ఈ దేవాలయంలోని హాల్ 12 స్థంబాలతో ఉంటుంది. ఈ 12 స్థంబాలు 12 రాశులకు సంకేతంగా గుర్తించే విధంగా చెక్కబడ్డాయి. ఆలయ గొడవెంట ఉన్న కిటికీ గుండా సూర్యకిరణాలు ప్రసరించి ఆ మాసం ఏ రాశిలో సూర్యుడు ఉంటాడో ఆ రాశి యొక్క స్తంభంపై పడుతాయి. ఇది ఒక సోలార్ క్యాలెండరు తెలిపేలా నిర్మాణం చేసారు విద్యారణ్య స్వామి.
12 వ శృంగేరి శారదా మఠ పీఠాధిపతి
ఆ తరువాత భారతీకృష్ణ తీర్ధ స్వామి విదేహ ముక్తి పొందిన తరువాత విద్యారణ్య స్వామి శృంగేరి శారదా మఠం పీఠం అధిరోహించి, జగద్గురువుగా 1380 నుండి 1386 వరకు 6 సంవత్సరాలు 12 వ పీఠాధిపతిగా నిర్వాహణ భాద్యతలు చేపట్టారు.
వైదిక ధర్మ రక్షణ కోసం కంచి, శృంగేరి పీఠాలు మాత్రమే చాలవని భావించిన విద్యారణ్య స్వామి ఆంధ్ర ప్రాంతంలో విరూపాక్ష పుష్పగిరి పీఠాలు, కర్ణాటకలోని శివగంగ, ఆమని పీఠాలు, మహారాష్ట్రలో సంకేశ్వరం, కొల్లాపురం పీఠాలు స్థాపించి హిందూ ధర్మ ప్రతిష్టాపన చేసి అనంతరకాలంలో ఛత్రపతి శివాజీ గురువు సమర్ధ రామదాసుకు ఆదర్శనీయులయ్యారు.
శ్రీ విద్యారణ్య స్వామి 1386 వ సంవత్సరంలో మే 26 న క్షయ నామ సంవత్సర జ్వేష్ట బహుళ త్రయోదశి శనివారం నాడు పరమపదాన్ని అలంకరించారు. ఆ తరువాత హరిహర, బుక్క రాయులు విద్యారణ్య పురం అనే పేరుతొ ఒక అగ్రహారాన్ని శృంగేరి మఠానికి దానం ఇచ్చారు.
హరిహర, బుక్క రాయులు విద్యారణ్య స్వామి గురించి శృంగేరిలో 1386 మే లో రాగి ఫలకం మీద రాసిన మాటలు...
విద్యారణ్యుడు బ్రహ్మాయా ?
కానీ నాలుగు ముఖాలు కనిపించడం లేదే...,
విష్ణువా ...?
నాలుగు చేతులు కనిపించడం లేదే...,
శివుడా...?
మూడో నేత్రం కనిపించడం లేదే...,
ఈ ప్రశ్నలు మమ్మల్ని వేధించగా మేము తెలుసుకొన్నది విద్యారణ్యుడు భగవంతుడు పంపిన ఒక అద్వితీయమైన శక్తి అని.
జ్ఞాపకశక్తి, తపశ్శక్తి, ఇచ్చాశక్తి, క్రియాశక్తి - ఈ నాలుగు శక్తుల సమ్మేళన స్వరూపమైన శ్రీ విద్యారణ్యులు ఒక తపస్సిగా, ఒక మహా యోగిగా, సామ్రాజ్య నిర్మాతగా, వైదిక ధర్మోద్ధారకుడుగా, వేదశాస్త్ర వ్యాఖ్యాతగా, రాజతంత్ర మర్మజ్ఞుడుగా, సకల శాస్త్ర పారంగతుడుగా, సంగీత, సాహిత్య, శిల్పకళా పోషకుడుగా, భగవదంశ సంభూతుడు అనటం అతిశయోక్తి కాదు.
దక్షిణ భారతంలో తిరిగి హిందుత్వంను ప్రతిష్టించి, అద్వైతాన్ని ముందుకు తీసుకుపోవడానికి శంకరాచార్యుల తరువాత శంకరాచార్యులంతటి కృషి చేసి, సాక్షాత్తు మరో శంకరాచార్యులుగా కీర్తింపబడిన శ్రీ శ్రీ శ్రీ విద్యారణ్య స్వామి గారి ని తెలుసుకునే ప్రయత్నం చేసాము.
విద్యారణ్య స్వామి చే నిర్మింపబడిన ఆ విజయనగరం, తమ గురువుల జ్ఞాపకార్ధం నిర్మించిన విద్యాశంకర దేవాలయాన్నిమరియు శృంగేరి పీఠం ను దర్శించుకోండి వీలుకల్గినప్పుడు. అలాగే మాములు ప్రజలు కూడా అర్ధం చేసుకొనే విధంగా తమ తపోశక్తితో రచించిన 'వేద భాష్యం' చదివి ధర్మ బద్దమైన జీవనం సాగె విధంగా మన ఆలోచనలు కలగాలని, హిందుత్వాన్ని కాపాడే శక్తి సామర్ధ్యాలు మనకు కలగాలని, విద్యారణ్య స్వామి అంతటి కార్యదీక్ష, తపోశక్తి మన లో స్ఫురించాలని ఆ శారదాంబ మాతను ప్రార్ధిస్తూ.... జై గురుదేవ.
శ్రీ శ్రీ శ్రీ విద్యారణ్య స్వామి వారి వీడియో చూడండి ...
మరిన్ని వీడియోల కోసం KUSUMA Creations Youtube Channel ను Subscribe చేసుకోండి.
KUSUMA Creations YouTube channel is a part of Bharatsahajavaani.
KUSUMA Creations YouTube channel is an online Bharat Sahaja Vaani of Dhamma Marg education platform, specialized in what is the dharma, Spiritual Gurus introduction, Spiritual right path and Health tips
భవతు సర్వ మంగళం
ఇంకా ఇవి కూడా చదవండి ...
శ్రీ త్రైలింగ స్వామి
పురాణ పురుష యోగిరాజ శ్రీ శ్యామాచరణ లాహిరీ
Swami Samarth Akkalkot Maharaj
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి