దత్తాత్రేయ యొక్క రహస్యం


జై గురు దత్త

   


           భాగవతంలో దత్తాత్రేయుడు విష్ణువు యొక్క ఇరవై ఒక్కటి అవతారములలో ఆరవదిగాను, శ్రీమన్నారాయణుని లీలావతారల్లో నాలుగవదిగాను చెప్పబడింది. దత్తావతారం దశావతారముల కంటే ఎంతో పురాతనమైనది. అన్ని అవతారములు తమకు నిర్ధేశింపబడిన కార్యము పూర్తి చేసుకొని, లోకం నుండి నిష్ర్కమించాయి. దత్తావతారం మాత్రం నిత్యసత్యవతారంగా విరాజిల్లుతున్నది. ఇది దుష్టులను సంహరించుటకు గాక, దుష్టభావాన్ని రూపుమాపి జనులందరిని జ్ఞాన ప్రభోదంతో సన్మార్గగాములయ్యేటట్లు చేయటానికి వచ్చిన విలక్షణ అవతారం. ఏ అవతార మూర్తికి లేని "గురుదేవ" అన్న విశేషణం దత్తాత్రేయుల వారికీ మాత్రమే ఉంది.



 

దత్తాత్రేయుని జననం   


          బ్రహ్మ మానసపుత్రులైన మహర్షులలో అత్రి ఒకరు. కర్దమ ప్రజాపతి దేవహూతి దంపతులకు జన్మించిన నవకన్యలలో ఒకరైన అనసూయ,  అత్రి మహర్షికి భార్యయైనది. బ్రహ్మదేవుడు తన కుమారుడైన అత్రి మహర్షిని పిలిచి సృష్టి క్రియలో తనకు సాయం చెయ్యమని కోరెను. అత్రి ఆ శక్తిని సంపాదించుటకు భార్య సహితంగా ఋక్షాద్రి పర్వతముపైకి పోయి అనేక శతసంవత్సరములు కఠోర దీక్షతో తీవ్రంగా తపస్సు చేశాడు. ఆయన శరీరం నుండి తపోగ్ని జ్వాలలు బయలుదేరి ముల్లోకాలను దహించివేయసాగాయి. అది చూచి త్రిమూర్తులు ఆయన వాంఛ సఫలం చెయ్యాలని అత్రి మహర్షి ముందు ప్రత్యక్షమయ్యారు. అత్రి ఆశ్చర్యముతో, "పుత్రార్థినై నిర్గుణమైన ఏకత్వమును ధ్యానిస్తే త్రిమూర్తులైన మీరు అనుగ్రహించారేమిటి?" అన్నాడు. దానికి త్రిమూర్తులు "మునీంద్రా! నీవు అత్రివైనా ఒక ప్రత్యేక సంకల్పముతో సగుణం గానే ధ్యానించావు కాబట్టి ముగ్గురం వచ్చాము. నీకు దత్తమవుతున్నాం. మా అంశలవల్ల నీకు ముగ్గురు కుమారులు పుట్టి లోక విఖ్యాతులై నీ ఆశయాన్ని దశదిశలా విస్తరింపజేస్తారు. శుభం భూయాత్" అని పలికి అదృశ్యమయ్యారు. బ్రహ్మాండ పురాణంలో దత్తాత్రేయ జననమునకు కారణమైన పై వృత్తాంతమేకాకుండా మరొక వృత్తాంతము కూడా చెప్పబడినది. 

          త్రిమూర్తులు అనసూయాదేవి పాతివ్రత్యమహిమ పరీక్షించదలచి అతిధి రూపములలో వచ్చి బిక్షయాచించి వివస్త్రయై వడ్డించాలనే షరతుపెట్టారు. అప్పుడు ఆ మహాసాధ్వి తన మహిమచే వారిని శిశువులుగా మార్చి ఆకలి తీర్చి లాలించింది. అప్పుడు త్రిమూర్తుల పత్నులు వచ్చి ఆమెను వేడుకొనగా ఆ శిశువులను మరల త్రిమూర్తులుగా మార్చి అప్పగించింది. అప్పుడు అత్రి మహర్షి తపస్సు నుంచి వచ్చాడు. త్రిమూర్తులు వరం కోరుకొనమని చెప్పగా, త్రిమూర్తులు కుమారులుగా జన్మించాలని, సర్వమానవాళి దుఃఖ నివృత్తికై యోగమును అనుగ్రహించాలనేది మా యొక్క కోరిక అని విన్నవించింది. "తథాస్తు !  అని పలికి త్రిమూర్తులు అంతర్ధానమయ్యారు.

          ఒక శుద్ధ పూర్ణిమనాడు త్రిమూర్తుల అంశాలలోని... బ్రహ్మాంశతో చంద్రుడు, విష్ణు అంశతో దత్తుడు, రుద్రాంశతో దుర్వాసుడు జన్మించారు. అత్రి మహర్షికి జన్మించిన చంద్రుడు మనకు కనిపించే చంద్రగోళం కాదు. వేదములో చంద్రుని సోముడంటారు. చంద్రునియందలి ఆధ్యాత్మిక ప్రజ్ఞయే అత్రికి జన్మించిన చంద్రుడు. పరవశత్వమనబడు మనోలయ స్థితిని యోగులకు ప్రసాదించువాడితడు. ప్రాణులందరికి తిధి నక్షత్రములననుసరించి చంద్రకిరణములు ప్రసరింపజేసి, లోక వ్యవహారములకు కావలసిన మానసిక స్థితిని ఆయువును ప్రసాదిస్తున్నాడు. దత్తాత్రేయుడు యోగనాధుడై భుక్తి ముక్తి ప్రదాతయై గురుదేవుడై విలసిల్లాడు. దుర్వాసుడు యమనియమములకు అధిదేవత. యతి మార్గాన్ని అవలంభించి, ఉన్మత్త వ్రతం స్వీకరించి దేశాటనకు వెళ్ళాడు.


అత్రి అనసూయల విశిష్టతలు 

 

          త్రిమూర్తులు, అత్రి మహర్షి అనసూయాదేవిలనే పరీక్షించడానికి, వారికే దత్తమవడానికి, వారి విశిష్టతలను కొన్ని పురాణగాధలు వివరిస్తున్నాయి. ఋగ్వేదంలోని 5 వ మండలాన్ని, తన తపో మహిమచేత అత్రి సందర్శించగలిగాడు. కృతయుగంలో రోగాలు పెచ్చుమీరి, ప్రాణహాని కలుగుతుంటే, "ఆయుర్వేద"మనే  ఉపవేదాన్ని దర్శించి, లోకాన్ని ఉద్దరించాడు. మరోసారి మనుప్రణీతమైన ధర్మశాస్త్రంను అర్ధం చేసుకోలేక పోతున్నామని ప్రజలు చింతిస్తుంటే, తేట తేట మాటలతో తానే ఒక మనుస్మృతిని సంతరించాడు. మరొకప్పుడు దేవదానవ సంగ్రామంలో, సూర్యచంద్రులు శత్రువులకు బందీలై చిక్కిన కారణాన, లోకమంతా అంధకారం అలుముకుంది. అప్పుడు దేవతల ప్రార్ధన మన్నించి తానే సూర్యుడు, చంద్రుడు కూడా అయి లోకాలకు వెలుగు ప్రసాదించాడు.

          ఇక అనసూయమాత గురించి చెప్పవలెనంటే, ఆ అద్భుతాలకు లెక్కలేదు. ఒకప్పుడు తీవ్రమైన ఎండలకు గంగానది ఎండిపోతే మునిజనుల సౌకర్యార్ధం ఆ నదిని ఆమె పునర్జీవింప చేసింది. మరొకసారి మహాక్షామం సంభవించి భూమి పై మొలకన్నది లేకుండా మాడిపోతే ఆమె వేలమంది మునిజనులకు, నిరంతరం కందమూలాలను సృజించిపోషించింది. ఇంకొకప్పుడు మహాపాపుల దేహాస్పర్శవల్ల గంగానది తన పవిత్రతను కోల్పోయి నల్లబడిపోగా, ఆ మహాసాద్వీ తన కమండలంలోని నీటిని ప్రోక్షించి, గంగాదేవి కాలుష్యాన్ని క్షణంలో తొలగించి, పునీతను గావించింది. కౌశిక బ్రాహ్మణుడిని పునర్జీవింపజేయడం, త్రిమూర్తులను పసిపాపలుగా మర్చి జోలపాడడం వంటి అద్భుత లీలలు ప్రదర్శించింది. తత్వపరంగాను, మహిమపరంగాను, అత్యున్నతమైన స్థితిలో ఉండి లోక కల్యాణకాంక్షతో జీవిస్తున్న అత్రి మహర్షి, అనసూయాదేవిల కన్నా జగద్గురువైన దత్తప్రభువుకు జననీ జనకులు కాగలిగిన యోగ్యత ఎవరికుంటుంది?

          దత్తాత్రేయ మహాత్యమును మార్కండేయ పురాణం, మత్స్యపురాణం, బ్రహ్మాండ పురాణం, హరివంశం, భాగవతం ఎంతగానో కీర్తించాయి. దత్తస్వామి పరశురాముడికి త్రిపురా రహస్యం బోధించాడు. కార్తవీర్యార్జునకు, విష్ణుదత్తుడికి, ప్రహ్లాదుడికి, అలర్కుడికి, పింగళినాగుడికి, యాదవుకు ఇంకా మరెందరికో జ్ఞానబోధ చేసి గురువై విరాజిల్లాడు. ఈ వివరములన్ని "శ్రీ దత్తపురాణం" లో మనోహరంగా వర్ణింపబడినవి.

దత్తాత్రేయుని జన్మించిన కాలం 

           దత్తాత్రేయుడు ఏ బ్రహ్మకల్పంలో జన్మిచారనేది స్పష్టముగా చెప్పబడలేదు. అత్రి మహర్షి కాలాన్ని బట్టి ఆయన పుత్రుడైన దత్తాత్రేయుడి కాలాన్ని నిర్ణయించ వలసివస్తుంది. అత్రి అనసూయలు స్వయం భువ మన్వంతరంకు చెందినవారు కావున, స్వయం భువ మన్వంతరంలోని కృతయుగంలో ఋక్షాద్రి  పర్వతంపై తపస్సు చేసుకుంటున్న అత్రి, అనసూయలకు పుత్రుడిగా  ఒకానొక వైశాఖ బహుళదశమి గురువారంనాడు రేవతి నక్షత్రయుక్త మీనలగ్న మినాంశలో దత్తాత్రేయుడు స్వయంగా అవతరించాడని పండితులు తెలుపుతున్నారు. అంతేకాక మరికొంతమంది పండితులు దత్తాత్రేయుడి ఆవిర్భావం 170 కోట్ల సంవత్సరాల క్రితం జరిగిందని అంచనావేస్తున్నారు. దీనితో దత్తాత్రేయుడు సృష్టి ఆరంభంలోనే అవతరించాడని తెలుస్తుంది.

       

దత్తాత్రేయుని స్వరూపం 

 


          దత్తాత్రేయుడు అనగానే మూడు ముఖములు, ఆరు చేతులు, వెనక కామధేనువు, ఔదుంబర వృక్షం, ముందు నాలుగు కుక్కలు గల దేవతా స్వరూపం మన కళ్ళకు గోచరమవుతుంది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులే మూడు శిరస్సులుగా, వారికి ఆధారమైన ప్రజ్ఞానమే దేహంగా, షట్ శాస్త్రాలే హస్తములుగా, అవిద్యను దరిజేరనీయని వేదాలే కుక్కలుగా, ధర్మమే గోవుగా, విశ్వశాంతియే ఔదుంబరంగా, ఆత్మజ్ఞాన ప్రబోధార్ధం యోగేశ్వరుడుగా ఆవిర్భవించిన మహాచైతన్యం యొక్క షోడశ కళాపూర్ణమైన వ్యక్త స్వరూపమే దత్త ప్రభువు.

          అయితే పైరూపమేకాక దత్తుడిని ఏక ముఖుడుగా, చతుర్భుజుడుగా శాండీల్యోపనిషత్తు చెప్పింది. వివిధ దత్తమంత్ర ధ్యాన శ్లోకములలో చాలా చోట్ల దత్తుడికి ఒకే ముఖము రెండు చేతులున్నట్లు తెలిపాయి.

          అలాగే దత్తాత్రేయుల వారు ఒకసారి బాలుడుగా, ఒకసారి కుమారుడుగా, ఒకప్పుడు యువకుడుగా, ఒకసారి వృద్ధుడుగా ఉంటాడు. ఒకసారి అవధూతగా ఉంటాడు. మరొకసారి ఉన్మత్తుడుగా, పిశాచవిష్టుడుగా ఉంటాడు. ఒకసారి పరమ నిష్ఠా గరిష్ఠుడైన యతీశ్వరుడుగా ఉంటాడు. ఒకసారి తలపై జడలుంటాయి. ఇంకోసారి సిగలుంటాయి. ఒకప్పుడు చేతిలో మద్యం పాత్ర ధరించి, దివ్యాంగనాలుంగీతుడై , మదవిహ్వలాక్షుడై ఉంటాడు. ఇంకోసారి బంగారుమేని ఛాయతో చిత్ర విచిత్ర మాల్యాంబరములతో శోభిల్లుతూ ఉంటాడు. ఒకోసారి కల్లుత్రాగుతూ, శరీరం నిండా బూడిద పూసుకొని దిగంబరుడుగా ఉంటాడని పురాణాల్లో వివరించాయి. .

          బ్రహ్మాండ పురాణంలో దత్తాత్రేయస్వామి కొలువు తీరిన వైభవం మనోహరంగా వర్ణించబడింది.

          మందార వృక్షం, దాని క్రింద మణి పీఠం, దానిపై ఆసీనుడైన దత్త స్వామి. ఆయన జడలలో మల్లెలు, మొల్లలు, జాజులు మొదలైన నానావిధ పరిమళ సంభరితపుష్పాలు, మెడలో మణిహారాలు, ఫణిహారాలు, రుద్రాక్ష స్పటిక మాలలు, మొలలో బంగారు మొలత్రాడు, వామాంకమున యోగలక్ష్మియైన అనఘాదేవి, వెనుక కామధేనువు, నాలుగు వైపులా శ్వానరుపాలలో చతుర్వేదాలు ఉంటాయి. స్వామి వారిని సనకసనందనాది సాధు సత్తములు, యోగులు, మహర్షులు, నవనాధులు, సిద్ధులు మొదలైన వాళ్లంతా పరివేష్టించి ఉంటారు. పరాశక్తి, వాగేశ్వరి, కామేశ్వరి, భువనేశ్వరి, శ్రీదేవి, భూతజాలము అష్టసిద్ధులు, ఐశ్వర్యములు, దేవతలు, దానవులు ఆయన ముందు చేతులు జోడించి నమస్కరిస్తుంటారు. భక్తవరదుడైన దత్తస్వామి వారికోర్కెలను అనుగ్రహిస్తుంటారు. అత్రి మహర్షి, అనసూయాదేవి ఒక ప్రక్కన, చంద్రుడు దుర్వాసుడు మరో ప్రక్కన కూర్చొని దత్త వైభవాన్ని వీక్షిస్తూ ఉంటారు. గంధర్వులు గానం చేస్తుంటే, అప్సరసలు నాట్యం చేస్తుంటారు. ఇలా నైమిశారణ్యంలో దత్తాత్రేయుల వారు రంగ రంగ వైభవంగా కొలువుతీరి ఉంటారని బ్రహ్మాండ పురాణంలో వర్ణించబడింది.

          ఈ వర్ణన దత్తాత్రేయుల వారి పరబ్రహ్మ తత్వాన్ని, గురు స్వరూపాన్ని, విశ్వరూపాన్నీ వెల్లడిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే దత్తాత్రేయులవారు సర్వజగన్మోహనుడు. ఆయన స్వరూప స్వభావములను వర్ణించింది. ఈ మూర్తి భేదాలను అధిగమించి దత్తుడు మనకు బోధించిన నిర్గుణ తత్వమును పట్టుకుంటే అనూహ్యమైన శక్తి దత్త మౌతుందనే విషయాన్నీ గ్రహించడం మంచిది.

            ప్రతిరోజు దత్తస్వామి ఆసేతు హిమాచలం సంచరిస్తుంటాడు అని పురాణాలు ఈ విధంగా వర్ణించాయి. దత్తాత్రేయుడు సహ్యాద్రిపై నివాసముంటాడు. రాత్రి సమయంలో మాహుర్ గడ్ లో శయనిస్తాడు. ఉదయం స్నానం కాశీలోని గంగానదిలో చేసి, గాణుగాపురంలో ధ్యానం చేసి, కురుక్షేత్రంలో ఆచమనం చేసి, గాణుగాపురంలో మాధ్యాహ్నికం నెరపి, ధూతపాపేశ్వరంలో భస్మధారణ కావించి, కర్ణాటకంలో సంధ్యావందనం చేసి, కొల్హాపురంలో భిక్షచేసి, పండరీపురంలో తిలక ధారణచేసి, పాంచాలేశ్వర్ లో గ్రహించిన భిక్ష భుజించి, తుంగభద్రలో జలపానంచేసి, బదిరీ నారాయణంలో శ్రవణం జరిపి, గిర్నార్ లో విశ్రాంతి తీసుకోని, సాయం సంధ్యావందనం పశ్చిమ సముద్ర తీరంలో నిర్వహిస్తాడు.

దత్తాత్రేయ తత్వ సాధన

 


           ఇంతటి మహిమాన్వితమైన యోగీశ్వరుని గురించి ఈ దత్త మహిమలను మనం కేవలం పారాయణం చేస్తేనే దత్త అనుగ్రహం కలుగుతుందా? అసలు దత్తుడు ఏమి బోధిస్తున్నాడు? అతని యోగ సాధన ఏమి చెబుతుంది? ఆ దత్తుడు అందించిన అనఘాష్టమి వ్రతం ఏమి? వాటితో సాధకులు చేయాల్సిన జ్ఞాన సాధన ఏంటి... ?  అని ఒక సాధకుడిగా, దత్తుని అంశం  ఏమి చెబుతుంది అని తీక్షణంగా పరిశీలిస్తే ఆ యోగ సాధన ఏంటిది, దాన్ని ఏవిధంగా సాధన చేయాలి, ఆ సాధనతో దత్తుని ఏ విధంగా దత్తం చేసుకోవాలనేది అర్ధం అవుతుంది. అది ఏంటంటే....

          ముందుగా మనం దత్తాత్రేయుడు అనే నామంలో తత్వపరమైన రహస్యార్థం ఏంటో తెలుసుకుందాం. దత్తుడు అంటే దత్తమైనవాడు. ఆత్రేయుడంటే అత్రి యొక్క సంతానం అని అర్ధం. శాండిల్యోపనిషత్తులో దత్తాత్రేయుడనే పేరులో గల తత్వజ్ఞాన రహస్యమును తెలుసుకున్నవాడు సర్వము తెలిసిన బ్రహ్మ జ్ఞానియగుచున్నాడు అని చెప్పుచున్నది. శుద్ధ చైతన్యం నుండి త్రిగుణాలు పుట్టి జగత్తు ఏర్పడింది కనుక జీవులందరుకు త్రిగుణాత్మక ప్రవృత్తి ఉంటుంది. అయితే వాటిని గమనించే సాధన మొదలెడుతే ఒక్కొక్క గుణం బేధానం జరుగుతూ జీవుడు త్రిగుణాతీతుడైనప్పుడే జీవన్ముక్తుడౌతాడనేది దత్తాత్రేయ తత్వ సాధనలో గల రహస్యం.

దత్తబీజం లోని మర్మం 

 

          బృహదారణ్యకోపనిషత్ లో ఒక కథ ఉంది. రాక్షసులు, మానవులు, దేవతలు ఒకసారి బ్రహ్మదేవుని దగ్గరకు వెడతారు. అక్కడ బ్రహ్మలోనుంచి "ద " అనే శబ్దం ఒక్కటే ఆయన సందేశంగా వెలువడింది. దాని అర్ధం ఏమై ఉంటుందా అని అందరూ ఆలోచించారు.

          రాక్షసులు - తమలో దయాగుణం లేదని అది కలిగి ఉండమని చెప్పాడనుకున్నారు.

          మానవులు - తమలో దానగుణం లోపించుచున్నదని, అది కలిగి ఉండమని చెప్పాడనుకున్నారు.

          దేవతలు - తమలో "దమం " అంటే అంతరింద్రియ నిగ్రహం లోపించుచున్నది కనుక దానిని కలిగి ఉండమని చెప్పాడనుకున్నారు.

          ఈ కాలంలో రాక్షసులు, దేవతలు అనేవాళ్ళు వేరే ఎక్కడో లేరు. మనిషి హృదయంలోనే అసురగుణాలు, దైవీగుణాల రూపంలో వాళ్ళున్నారు. రాక్షస గుణం తొలగించు కోవడానికి అనసూయత్వమును స్వీకరించి దయను పెంపొందించు కొని మానవుడిగా మారాలి. తర్వాత త్యాగ గుణం పెంపొందించుకొని మానవత్వమును సంపూర్ణంగా వికసింప చేసుకోవాలి. ఆ తర్వాత అంతరింద్రియ నిగ్రహం పాటించి దివ్యత్వంలోకి ఎదగాలి. అప్పుడు స్థిత ప్రజ్ఞుడు అనిపించుకొంటాడు. ఆ మానసిక పరిణామంతో జ్ఞాన యోగంతో విశ్వశక్తిని పొందగలుగుతాడు. "దత్తోహం" (నేనే దత్తుడిని) గా మారిపోతాడు.

అవధూతాశ్రమం - పంచమాశ్రమం 

 

          చతుర్విధపురుషార్ధ సాధన కోసం, మానవ జీవితంలో బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాసాశ్రమము అనే చతుర్విధ ఆశ్రమములు నెలకొల్పబడినవి. దత్తాత్రేయుల వారు బ్రహ్మచారి అని చెప్పబడినా ఆయన ఈ నాలుగు ఆశ్రమములకు అతీతంగా ఉండి 'అత్యాశ్రమి ' అని పేరు పొందాడు. ఆయన్ను బ్రహ్మచారి అని అన్నప్పటికీ అందులో ప్రధాన ఉద్దేశం ఆయన సగుణ స్వరూపంలో ఉన్న పరబ్రహ్మ అయినా సదానిర్గుణ పరబ్రహ్మతత్వములో రమించే వాడు అన్నదే అందులోని రహస్యం. ఒకసారి దత్తాత్రేయుడి వేషం చూచి పింగళి నాగుడు ఆశ్చర్యపడి "మీదే ఆశ్రమం"? అని ప్రశ్నిస్తే దత్తస్వామి ఇచ్చిన సమాధానంలో ఆయన యోగపద్ధతి ఆయన ధ్యేయం మనకు బోధపడుతుంది.

          "ఈ నా ఆశ్రమము గురించి ఇంతకు ముందెప్పుడు ఎవరూ కని విని ఎరుగరు. చతుర్విధ ఆశ్రమముల కంటే నా ఆశ్రమం భిన్నమైనది. ఈ ఆశ్రమంలోని వాళ్లంతా జగత్తును తన ఆత్మగా సందర్శిస్తుంటారు. త్రిగుణా తీతులై, నిస్సంగులై ఉంటారు. వాళ్లకు వేదాలతో, మంత్రాలతో, తంత్రాలతో, పూజలతో, జపాలతో, తపాలతో పనిలేదు. సదా పరతత్వవశులై ఉంటారు." దత్తాత్రేయుడు చెప్పిన ఈ పంచమాశ్రమం అవధూతాశ్రమం.

అవధూత అనగా... 

 

          అవధూతగీత లో "అవధూత"అన్న పదములోని నాలుగు అక్షరములు గల అర్ధాలను ఇట్లా వివరించింది.

          అవధూత పదంలోని "అ " అనే దానికి ఆశాపాశముల నుండి విముక్తి పొందినవాడు, ఆదిమధ్యాంతములందు నిర్మలుడు, ఆనందాన్ని నిరంతరం పొందేవాడు అని.

          "వ" అనేదానికి వాసనల నుండి (పూర్వ కర్మ వాసనలనుండి) విడివడిన వాడు, నిరామయమైన బ్రహ్మగా పేర్కొనదగిన వాడు, వర్తమానంలోనే (భూత భవిష్యత్ ఆలోచన లేక) ఉండేవాడని.

          "ధూ" అనే దానికి ధూళితో కూడిన శరీరం గలవాడు, మనస్సును స్వాధీనం చేసుకున్నవాడు, దోష రహితుడు, ధ్యాన ధారణలు లేనివాడు అని.

          "త" అనే దానికి తత్త్వ చింతనకలిగినవాడు, తమో గుణమును, అహంకారమును విడిచినవాడు అని అర్ధము.

          శృతి స్మృతులు బోధించే విషయాలన్నిటియందు పరిపూర్ణ జ్ఞానముగలవాడై, పరబ్రహ్మయందే మనస్సు లగ్నము చేసినవాడై, జీవన్ముక్తుడైన మహాజ్ఞానినే, "అవధూత" అని నిరాలంబాపనిషత్తు చెప్పింది. దిగంబరుడు, మహాజ్ఞాన స్వరూపుడైన అవధూతే దత్తప్రభువు. 

          ఈ అవధూత దత్తున్ని మనం దత్తం చేసుకోవాలంటే ముందుగా మనం అత్రి, అనసూయల స్థితికి చేరుకోవాలి. ఆ స్థితిలు ఏంటంటే....

అత్రి, అనసూయల రహస్యార్థం 

 


          అత్రి అన్నపదం సాధకుడి యొక్క ఉన్నత స్థితిని సూచిస్తుంది. మూడు లేనివాడు లేదా మూడు కానివాడు ఎవడో వాడు. అత్రి ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆదిదైవికములనే తాపత్రయములు, సత్వ, రాజస, తమో గుణములు, బ్రహ్మగ్రంధి, విష్ణుగ్రంధి, రుద్రగ్రంధి అని పిలవబడే త్రయములు లేనివాడు అత్రి. అంటే వాటినన్నింటిని అధిగమించిన స్థితిలో ఉన్నవాడు. ఈ స్థితిని సాధకుడు పొందాలంటే ముందుగా అనసూయ స్థితిని పొందాలి, అంటే అసూయను పూర్తిగా వదిలిన మానసిక స్థితి. అత్రి మహర్షి అనసూయను సహధర్మ చారిణిగా చేసుకున్నాడని చెప్పారు.

          అసూయను వీడిన స్థితి అనసూయాది. అనగా జీవుడు మాయను వదిలిన స్థితి. త్రిమూర్తులు పరీక్షార్థం అనసూయను వివస్త్రవై భిక్ష పెట్టమని కోరితే ఆమె ఆ విధంగా చేసింది. జీవుడికి స్వస్వరూప జ్ఞానం కలుగకుండా చేసేందుకు మాయ ఒక వస్త్రంలాగా కప్పివేస్తుంది. ఆ మాయను తొలగిస్తే దిగంబరత్వమనే జ్ఞాన స్థితి లభిస్తుంది. అనసూయతత్వం సిద్ధిస్తుంది.

          చతుర్విధ పురుషార్థ సాధనకు అవరోధంగా నిలిచేవి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములనే ఆరు శత్రువులే కాక పైశున్యం (చాడీలు చెప్పడం), అసూయ అనే మరో రెండు గుణాలను కలిపి వరాహ పురాణంలో చెప్పబడింది. లోతుగా పరిశీలిస్తే, అసూయను ఆధారం చేసుకొనే మిగిలిన ఏడు దుర్గుణాలు విస్తరిస్తాయి. మానవుడు దయకలిగి ఉండాలి. ప్రేమ, జాలి కూడినదే దయ, ప్రేమ ఉన్నచోట ద్వేషం ఉండదు. ద్వేషమున్న చోట ప్రేమ ఉండదు. మనిషిని ద్వేషించకుండా ఉంటే ఏదోరోజున ఆ మనిషి పై ప్రేమ కలుగుతుంది. ఎవరిమీదైనా అసూయ కలిగినప్పుడే మనకు తెలియకనే వారిపై ద్వేషం కలుగుతుంది. అసూయను మనలో చేరనీయకుండా చేయటమే, అనసూయను సహధర్మచారిణిగా చేసుకొనడం.

          అనసూయత్వం మనలో నిండుతున్నకొలది కామక్రోధాదులు నశిస్తాయి. అన్ని తాపత్రయాలు దూరమవుతాయి. మనసు నిశ్చలత నొంది జీవన్ముక్త స్థితికి తీసుకోని వెడుతుంది. అందుకనే మన ఋషులు సాధనలో అనసూయత్వానికి అంత ప్రాధాన్యతను ఇచ్చారు. సాధకుడు అనసూయను మానసిక సహధర్మచారిణిగా చేసుకున్నప్పుడు క్రమంగా తమోగుణం రజోగుణంలో కలిసి, ఆ రెండు వాటి ప్రత్యేకతను కోల్పోయి సత్వగుణంలో విలీనమవుతుంది. ఆ తర్వాత అది శుద్ధ సత్వంగా మారుతుంది. ఇలా సాధకుడు త్రిగుణాతీత స్థితికి చేరుకున్నప్పుడే అత్రి అవుతాడు. అప్పుడు పరబ్రహ్మ శక్తి లేదా విశ్వశక్తి లేదా యోగ శక్తి సంపూర్ణంగా స్వంతమవుతుంది. అప్పుడు నిర్గుణ యోగశక్తిని అంటే దత్తశక్తిని దత్తం చేసుకోవటం ప్రారంభమవుతుంది. అలా ఆత్మ స్థితమౌతుంది. యోగశక్తి ఆత్రేయమౌతుంది.

          ఈ విధంగా సాధకుడికి ముందు దత్తమైన త్రిమూర్త్యాత్మక శక్తి,  ఆ తర్వాత అతని సాధనాబలం వల్ల త్రిగుణాతీత స్థితికి చేరుకొని, అతణ్ణి అత్రిగా మర్చి, యోగశక్తిగా మారి అతడికి పూర్తిగా వశమౌతుందన్న సాధనా రహస్యమును వెల్లడించేటందుకే ఆ శక్తిని సాధకుడి యొక్క కుమారుడుగా చెప్పి "దత్తాత్రేయు" డని వ్యవహరించటం జరిగింది.

           ఇలా రజోగుణం, తమోగుణం సత్వంలో కలిసి శుద్ధ సత్వంగా మారినప్పుడే దత్తుని యోగశక్తి లభిస్తుందని చెప్పడానికే దుర్వాసుడు తన తమోగుణాన్ని, చంద్రుడు తన రజోగుణాన్ని సత్వగుణ ప్రధానుడైన దత్తునికిచ్చి వెళ్లిపోయారని పురాణాల్లో చెప్పటం జరిగింది. దత్తుడి యోగపరిణామక్రమంలోని రహస్యమిది. అత్రి అనసూయలు కలిసి యోగశక్తి ఎట్లా దత్తం చేసుకోవచ్చో నిరూపించారు.

దత్తాత్రేయ తత్వ చైతన్యం 

 

          జీవులందరూ సర్వగతమైన చైతన్యమును గుర్తించి పరస్పరము ప్రేమానురాగములు పంచుకుంటూ, సహాయ సహకారములు అందించుకుంటూ విశ్వప్రేమను అలవర్చుకుని, విశ్వకుటుంబ భావంతో శాంతియుత సహజీవవం సాగించి, సచ్చిదానంద స్వరూపులై, జీవన్ముక్తులై విశ్వకల్యాణాన్ని సాధించాలి. ఇదే సనాతన ధర్మ సూత్రం. ఇదే జివులందరి ఆత్మ ధర్మం లేక స్వధర్మం. దీనిని ఆచరిస్తూ జీవించడమే జీవులందరి కర్తవ్యము, లక్ష్యము. ఈ లక్ష్యసాధనలోనే సృష్టి వికాశం ఇమిడి ఉంది. దీని కొఱకే ఆ యుగంలో అత్రి మహర్షి, అనసూయాదేవి దంపతులు, ఈ యుగంలో ఎందరో సంత్ లు , యోగులు ఆ దత్తశక్తిని దత్తం చేసుకొని, దత్తాత్రేయ అంశంగా మారి దత్తాత్రేయ గురు పరంపరను కొనసాగిస్తున్నారు. దత్తస్వామి వటవృక్షమైతే వీరందరూ దాని కొమ్మలు, ఊడలు వంటివారు. వారిలో కొందరు ఊడలవలె భూమిలో దృడంగా నాటుకొని మూల వృక్షంతో సమానముగా నిలిచి సాధకుల భవతాపాన్నిబాపి బ్రహ్మత్వాన్ని సిద్ధింపజేస్తున్నారు. వారిని దత్తావతారాలుగా ఆరాధిస్తుంటారు. అట్టి వారిలో ప్రసిద్ధి చెందిన తొమ్మిది దత్తావతారాలు...

  1. శ్రీ పాద శ్రీ వల్లభులు 
  2. శ్రీ నృసింహ సరస్వతి
  3. శ్రీ మాణిక్య ప్రభువు 
  4. శ్రీ స్వామి సమర్థ అక్కల్ కోట మహారాజ్ 
  5. శ్రీ షిరిడి సాయి 
  6. శ్రీ వాసు దేవానంద సరస్వతి 
  7. సంత్ గజానన్ మహారాజ్ 
  8. హజరత్ తాజుద్దీన్ బాబా 
  9. సిద్దేశ్వర్ సంత్ శ్రీ గులాబ్ బాబా  

జీవిత లక్ష్య సాధన

 

        ధర్మార్ధకామమోక్షములనే చతుర్విధ పురుషార్ధముల సాధనే జీవిత లక్ష్యమని పెద్దలు చెప్పారు. లోకంలో నాలుగు రకాల జీవులుంటారు. వారు ఆర్తులు, అర్ధార్ధులు, జిజ్ఞాసువులు (ముముక్షువులు) జ్ఞానులు (ముక్తులు). అర్ధకామముల ప్రాప్తికోసం దైవాన్ని ఆశ్రయించే ఆర్తులు, అర్ధార్ధులు దేవీదేవతా రూపములను ఆశ్రయించి కోరికలు కోరుకోవడం. అవి తీరగానే వాటి వెనకాలే కోరికల పట్టిక మరొకటి సిద్ధంగా తయారుచేసుకుంటూ ఉంటారు. 
          సత్యము, జ్ఞానము అనంతమైన పరబ్రహ్మ గురించి మాత్రమే వేదములు ఘోషిస్తుంటే, ఆ తర్వాత కాలంలో వచ్చిన ఆగమాలు పురాణేతిహాసములు త్రిమూర్తుల గురించి, అనేక దేవీదేవతామూర్తుల గురించి అవతార పురుషుల గురించి వెల్లడించాయి. అనేక ఆరాధనా పద్ధతులు, ఉపాసన మార్గములు లోకంలో వెలిసాయి. వివిధ దేవతామందిరములు నిర్మించేవారు, నిర్వహించేవారు, అందలి అర్చకులు "మా దేవుడు గొప్పంటే మా దేవుడు గొప్ప. మా దేవుడు దగ్గర మ్రొక్కుకుంటే ఏ కోరికయైన తీరుతుంది" అంటూ పోటీలు, కీచులాటలవల్ల ఆస్తికుల మధ్య అనైక్యత ప్రబలిపోయింది. ధర్మము, జ్ఞానము, మోక్షము కొరకు ప్రయత్నం చేసే ముముక్షువులు తక్కువైపోయారు. 
          జిజ్ఞాసువులు లేదా ముముక్షువులు కానివాళ్ళకు దైవంకాని, ఏ గురువుకాని చెయ్యగలిగింది ఏమిలేదు. కర్మ, భక్తి, జ్ఞాన సమ్మిళితమైన యోగసిద్ధిని పొందగోరే జిజ్ఞాసువులందరూ ఈ తత్వ యోగ సాధన చేయాల్సిందే.
ఈ ఆర్టికల్ యొక్క వీడియో ను చూడండి.         

           

                                                                                                         

మరిన్ని వీడియోల కోసం KUSUMA Creations Youtube Channel ను Subscribe చేసుకోండి. 


KUSUMA Creations YouTube channel is a part of Bharatsahajavaani.

KUSUMA Creations YouTube channel is an online Bharat Sahaja Vaani of Dhamma Marg education platform, specialized in what is the dharma, Spiritual Gurus introduction, Spiritual right path and Health tips  

ఇవి కూడా చదవండి... 

శ్రీ విధ్యారణ్య స్వామి

శ్రీ త్రైలింగ స్వామి

పురాణ పురుష యోగిరాజ శ్రీ శ్యామాచరణ లాహిరీ 

Swami Samarth Akkalkot Maharaj

భవతు సర్వ మంగళం


         

కామెంట్‌లు