Honest

నిజాయితీ 

Honest

 

  

           ధర్మ బద్దమైన జీవనం సాగించాలంటే కొన్ని ప్రాథమిక నియమాలు పాటించాలి, అవి పాటించినప్పుడే మనం ధర్మ పథంలో ధర్మంతో నడుస్తున్నట్లు, ధర్మాన్ని రక్షిస్తున్నట్లు అవుతుంది. అలాంటి ప్రాథమిక నియమాలలోని ఒక దాని గురుంచి ఈ చిన్న కథ ద్వారా తెలుసుకుందాం.


          మగధ రాజ్యాన్ని రాజనందుడు అనే రాజు పాలిస్తూండేవాడు. ఆయన నిస్వార్ధపరుడు. బంధుప్రీతి, తరతమ భేదాలు లేకుండా అందరినీ సమానంగా చూస్తూ, మంచి పరిపాలకుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఆ రాజ్యంలో కోశాధికారిగా పనిచేస్తున్న నుషేణుడ పదవీ విరమణ చేశాడు. ఆ స్థానాన్ని భర్తీచేసే బాధ్యతను మహామంత్రికి అప్పగించాడు రాజనందుడు. 

          కోశాధికారి పదవికి తగిన అభ్యర్థి కోసం మహామంత్రి రాజ్యంలో దండోరా వేయించాడు. నిర్ణీత సమయానికి కొందరు వచ్చారు. మహామంత్రి వారి యోగ్యతలను, విద్యలను పరిశీలించి ఆనందుడు, దీప్తుడు అనే ఇద్దరినీ అర్హులుగా తేల్చాడు. ఇద్దరూ సమఉజ్జీలుగా ఉన్నారు. కోశాధికారి పదవికి కావలసింది ఒక్కరే కాబట్టి వారిద్దరిలో ఒకరిని ఎంపిక చేయటానికి తన ఇంటికి తీసుకెళ్లాడు మహామంత్రి. 

          వారితో కాసేపు లోకాభిరామాయణం మాట్లాడిన మహామంత్రి... ఆనందుడిని పక్కకి తీసుకెళ్లి "చూడు మిత్రమా! మీ ఇద్దరిలో నేనెవరిని ఎంపిక చేస్తే వారికే ఈ కొలువు వస్తుంది. కాబట్టి నీవు నాకు వెయ్యి వరహాలను ఇవ్వు" అన్నాడు. దానికి ఆనందుడు "మహామంత్రి! నాకు కొంత వ్యవధి ఇవ్వండి. మీరు కోరిన వెయ్యి వరహాలు ఇవ్వటమే కాకుండా కోశాగారం నుంచి మీరు ఎప్పుడు డబ్బు తీసుకున్నా వాటిని లెక్కల్లో చూపించకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటాను. కాబట్టి ఈ కొలువు మీరు నాకే ఇవ్వండి" అని కోరాడు. 

          ఆ తర్వాత దీప్తుడిని కూడా మహామంత్రి ఇదే విధంగా లంచం అడిగాడు. మహామంత్రి మాటలు విన్న దీప్తుడు "నేను లంచాలు, కానుకలు ఇచ్చి పదవిని పొందేవాడిని కాను. ఎప్పటికైనా స్వశక్తితో, తెలివితేటలతో, నైపుణ్యంతో పదవిని పొందుతాను. అంతేగాని ఇలాంటి అడ్డదారులు తొక్కను. ఇంకో విషయం, నేను ఈ కొలువులో చేరితే నీలాంటి వారిని మహారాజుకి పట్టిస్తాను." అని నిర్భయంగా చెప్పాడు. 

          మహామంత్రి వెంటనే "శభాష్! మీ ఇద్దరిలో ఎవరు నిజాయితీపరుడో తెలుసుకోవడానికే ఇలా మాట్లాడాను. నీలాంటి నిజాయితీపరులు, ధైర్యవంతులే ఈ పదవికి అవసరం" అని చెప్పి, అతడిని మహారాజు దగ్గరకు తీసుకెళ్లాడు. జరిగిన సంగతి తెలుసుకున్న మహారాజు కోశాధికారి పదవిని దీప్తుడికి అప్పగించాడు. 

          ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన ధర్మం ఏమి అనగా... 
ఈ కథలో ఆనందుడు, దీప్తుడిలో ఎవరు నిజాయితీ పరుడని తెలుసుకోవడానికి మహామంత్రి ఒక చిన్న పరీక్ష పెట్టాడు, అందులో ఆనందుడి వ్యక్తిత్వం వెంటనే బయటపడింది. కోశాధికారి పదవి అనేది ఎప్పుడు డబ్బులు, రత్నాలు, బంగారం మరియు వజ్రాలు లాంటివి తమ కండ్ల ముందే రాశులు పోసి ఉంటాయి, వాటిని లెక్కకట్టి మరియు వాటి సంరక్షించే ఉద్యోగం. ఈ భాధ్యతను నిర్వర్తించే సమయంలో వారిలో కలిగే లోభం, నిజాయితీ ఎంత ఉందని తెలుసుకోవడానికి పెట్టిన పరీక్షలో ఆనందుడు తక్షణమే లోభానికి బానిసై పోయినాడు. కానీ అదే దీప్తుడు లోభానికి లొంగక నిజాయితీగా, నిర్భయంగా మహామంత్రి అనే భయం లేకుండా ఇలాంటివి అడిగినందుకు మరియు భవిష్యత్తులో ఇలాంటివి తన ఎదుట కనబడితే వెంటనే రాజుగారికి పట్టిస్తానని ధైర్యంతో నిజాయితీగా చెప్పేసరికి ఆ కోశాధికారి ఉద్యోగం దీప్తుడికి వరించింది. 

          అవతలివాళ్ళ కళ్ళు గప్పి వస్తువును చేజిక్కించుకోవడం మాత్రమే దొంగతనం కాదు, మనది కానీ దానిని, మనకు ఇవ్వబడని దానిని తీసుకోవడాన్ని, దొంగతనం క్రిందికే వస్తుంది. 

          లోభంతో, అత్యాశతో, తప్పుడు దారిలో ధనాన్ని సంగ్రహించడం, స్వలాభం కోసం ప్రజలను దోచుకోవటం, ప్రజల సొమ్మును కాజేయటం, దానిని తప్పుడు లెక్కలతో చూపెట్టడం, వంచించే మాటలతో లోబరుచుకోవటం లాంటివి... ఇవి ఉద్యోగ సమయంలోనే కాదు జీవితంలోని ఏ ఘట్టం లోనైనా నిర్వర్తించినా... అవి అన్ని దొంగతనం క్రిందికే వస్తుంది. కావున ఇవన్నీ అధర్మమే, వాటి అధర్మ పాపఫలం వారికీ అంటుతుంది. 

          దీనికి సరైన మార్గం ఏమనగా... ధర్మంగా నడుచుకోవడం అదే నిజాయితీగా, నిర్భయంగా ఉండటం. ఇదే ధర్మం. దీన్నే ధర్మాన్ని రక్షించడం అవుతుంది. ఈ నిజాయితే వ్యక్తిని ఉన్నతంగా తీర్చిదిద్దుతుంది. ఎవరైతే ధర్మాన్ని రక్షిస్తారో వారిని ధర్మం కాపాడుతూ ఉంటుంది అన్నివేళలా. అందుకు సర్వులు ధర్మంగా నడవడానికి అడుగులు వేయండి. ఆ ధర్మం సర్వదా రక్షిస్తుంటుంది. ధర్మం శరణం గచ్చామి. 

ఈ కథ యొక్క వీడియో చూడండి ... 




మరిన్ని వీడియోల కోసం KUSUMA Creations Youtube Channel ను Subscribe చేసుకోండి. 

KUSUMA Creations YouTube channel is a part of Bharatsahajavaani.
 
KUSUMA Creations YouTube channel is an online Bharat Sahaja Vaani of Dhamma Marg education platform, specialized in what is the dharma, Spiritual Gurus introduction, Spiritual right path and Health tips  

       
 ఈ వీడియో మీకు నచ్చినదని భావిస్తూ... 

భవతు సర్వ మంగళం 

ఇవి కూడా చదవండి... 



         


కామెంట్‌లు