అహంకారం వినాశహేతువు

Pride

అహంకారం వినాశహేతువు!


          అరిషడ్వార్గాల్లోని మదము అహంకారాన్ని సూచించే లక్షణమే. అధికత్వ భావన ప్రదర్శనమే అది. గర్వం దాని మరో రూపం. మన పురాణ, ఇతిహాసాల్లో చాలా పాత్రలు ఈ అహంకారాన్ని కలిగి ఉన్నాయి. మహాభారతం ఉద్యోగ పర్వంలో కృష్ణ రాయబార ఘట్టంలో చెప్పవలసిన హితవు ఎవరు చెప్పినా లక్ష్యపెట్టడు దుర్యోధనుడు. అప్పుడు ఆ సభలో ఉన్న పరశురాముడు తన మాటగా చెప్పిన దంభోద్భవుడు అనే రాజు కథ గురించి తెలుసుకుందాం.  




అహంకారం.... 

అంటే ..... 
          'నేను' మరియు 'నా' అనే స్వంత ప్రాముఖ్యము మరియు సామర్ధ్యానికి సంబందించిన భావనే అహం. ఇది ఆత్మగౌరవం లాంటిదే. అయితే ఈ అహం పెచ్చుమీరి, 'నేను' మరియు 'నా' నుండి "నేనే" మరియు "నాదే " గా పరివర్తనం చెందుతే దాన్ని అహంకారం అనబడుతుంది.

Pride is devastating, Ahankaram


       
          ఆత్మగౌరవానికి, అహంకారానికి  చాలా పోలిక ఉంది, వాటిని విభజించేది చాలా సన్నటి రేఖ. ఈ సామర్ధ్యం నాకుంది అనడం ఆత్మగౌరవం. ఈ సామర్ధ్యం నాకొక్కడికే ఉంది అనడం అహంకారం. కోపం లాగే అహంకారం కూడా అతి ప్రమాదకరమైనది, అనర్ధ దాయకం కూడా... ఎవరైనా ఒక తప్పు చేస్తే దాన్ని ఎదుటివాడు ఎత్తి చూపితే ఎంతమంది ఆ విమర్శను సానుకూలంగా స్వీకరించి ఆ తప్పును ఒప్పుకుంటారు? చాలా తక్కువ, ఒక తప్పు చేసి దాన్ని సరిదిద్దుకోనప్పుడు వాడు మరో తప్పు చేస్తున్నట్లే లెక్క. ఈ విషయంలో అహంకార పాత్ర చాలా ఎక్కువ.
          'నేను వాడికంటే ఎం తక్కువ?' అనే భావన ఎప్పుడైతే కలుగుతుందో అది అనర్ధాలకు దారి తీస్తుంది. జాగ్రత్తగా గమనిస్తే ఈ అహంకారం వల్ల మనం రోజూ అనుభవించే అనర్ధాలేన్నో.
ఒకరి అహంకారం, ఆ మనిషి వరకే పరిమితమైతే పొతే పోనీ అనుకోవచ్చు. కానీ అదే, ఒక్కరి అహంకారం వల్ల ఒక కుటుంబం, జాతి, దేశం ఇంకా మాట్లాడితే ప్రపంచమే నాశనమైన సందర్భాలున్నాయి...

          రెండో ప్రపంచయుద్ధానికి కారణం హిట్లర్ అహంకారం. అంతేదుకు ఈ అహంకారం వల్ల కల్గిన పరిణామాలెన్నో మన పురాణాల్లో, చరిత్రలో కొకళ్ళు ఉన్నాయి. 

          దురదృష్టకరమైన విషయమేమిటంటే తెలిసి కూడా ఈ అహంకారాన్ని అదుపులో పెట్టుకోకుండా వారు దాన్ని ఆత్మగౌరవంగా సర్దిచెబుతుంటారు. అదే పని ఆనాడు దుర్యోధనుడు చేసి ఉంటె కురుక్షేత్రం జరిగి ఉండేదికాదు. 

          దుర్యోధనుడు కూడా ఎంతమంది హితవు చెప్పిన వినకుండా అహంకారానికి పోయి యుద్ధాన్నే కోరుకున్నాడు.

ఉద్యోగపర్వంలోని కథ ఇది....

          కృష్ణుడు రాయబారానికి వచ్చి తను చెప్పవలసిన హితవులన్ని దుర్యోధనుడికి చెప్పాడు. అయినా దుర్యోధనుడు మనసు మార్చుకోడు, అప్పుడు ఆ సభలో ఉన్న మహర్షి పరశురాముడు దుర్యోధనుడికి  చేసిన హితబోధ... 

నాయన! దుర్యోధనా !
          నీకు, నీ వారికీ సర్వప్రపంచానికీ మేలుకలిగే విషయం చెపుతున్నాను. ఆవేశపడకుండా సావధానంగా విను... 
చాలా రోజుల క్రితం మాట. 
         దంభోద్భవుడు అనే పేరుగల రాజు ఉండేవాడు. ఆయన ఈ భూమండలం అంతనూ పాలించేవాడు. భుజ బలంలో పరాక్రమంలో ఆయనకు సాటివచ్చేవారు లేరు ఆ రోజుల్లో, అంతటి మహాయోధుడాయన. 

         ఆయన రోజు ఉదయంలేచి, కాలకృత్యాలు పూర్తికాగానే బాగా అలంకరించుకొని రత్నకిరీటం ధరించి, కోడెత్రాచువంటి కరవాలం చేత బట్టి సభా భవనానికి వచ్చి బంగారు సింహాసనం అధిరోహించేవాడు. 

        ఆ సభలోని పండితులు ఆయన బల పరాక్రమాలనూ గానం చేస్తుంటే... కోరమీసం మెలితిప్పుతూ ఆనందించేవాడు. అంతేకాక తన కొలువులో ఉన్న వారందరినీ చూస్తూ...

Pride is devastating, Ahankaram


        ఈ భూలోకంలో ఎవడైనా నాతో యుద్ధం చేయగల మహావీరుడున్నాడా! గదా, ఖడ్గ ప్రాసాది ఆయుధాలతోకాని, ఆగ్నేయ, వరుణ, వాయువ్యాధి అస్త్రాలతోకాని నన్ను ఎదుర్కోగల వీరుడుంటే చెప్పండి. అంతేకాదు మల్లయుద్ధం చేయగల వీరుడు ఉన్న వాడిని క్షణంలో కడతేరుస్తాను.. అని గర్వంగా నవ్వుతూ భుజాలు ఎగురవేసేవాడు. 
ఆయన బల పరాక్రమాలెరిగిన వారెవరూ యుద్దానికి దిగేవారుకారు.
          ఎవరు ఆ రాజునూ ఎదిరించే సాహసం చేయకపోయేసరికి ఆయనకు అహంకారం నానాటికీ పెరుగుతూ వచ్చింది. నా అంతటివాడు లేడనే గర్వంతో ఆయన విర్రవీగుతూ ఉండేవారు. అటువంటి అహంకారం ఉన్న రాజుకి అనుచరులుకూడా అటువంటి అవివేకులే దొరుకుతారు కూడా... వారు రోజూ ఆయన బల పరాక్రమాలను పొగుడుతూ ఉండేవారు.

          అలా ఉండగా ఒకనాడు ఆయనను చూడడానికి సభా భవనానికి వచ్చిన దూర దేశీయులైన విప్రులు... రాజు గారి అహంకారం చూసి..

        మహారాజా ! మీరు నిజంగా మహావీరులే. బల పరాక్రమ సంపన్నులే. అయితే... 
        గంధమాదన పర్వతం మీద నర నారాయణులని ఇద్దరు తీవ్రనిష్ఠతో తపస్సు చేస్తున్నారు. వారిని జయించగల వీరులు మూడులోకాలలో లేరని విన్నాము. తమకు కోరిక ఉంటె వారితో యుద్ధం చేయవచ్చు అన్నారు. 

         ఆ మాట విని ఆయనలోని అహంకారం రెచ్చిపోయి, అగ్నిపర్వతంలా లేచి కత్తి జులిపించి, గట్టిగా నేలమీద పాదంతో తొక్కి, ఎంత కావరం. నన్ను మించిన యోధులా వారు, అంటూ కోపంతో ఊగిపోయారు. 

         రాజుకు కోపం వస్తే తమకే నష్టమని ఎవరూ ముందుకూ రాక ఆయన్ని బలపరాక్రమాలనే పొగుడుతూ వచ్చారు, ఆ సభలోని వారు. అందుకే అహంకారం కల్గిన వారి వెంట, వారిని పొగిడేవారే ఉంటారు, నిజాలు చెప్పే వారు ఉండరు. ఎందుకంటే ఇలా నిజం చెబితే వారి అహంకారం దెబ్బతిని దానితో ఏ అనర్ధం వస్తుందో అని అందరు దూరంగా ఉంటారు.. ఇగ వారితో ఉండేవారు ఎవరూ  అంటే ఆ అహంకారుల తో తమ పనులు చక్కబెట్టుకొనే వారు, వీరి గుట్టు ఆ అహంకారుల చేతిలో చిక్కిన బలిపశువులు, ఇంకా..  నిజాలు చెప్పే ధైర్యం లేక వారి అహంకారానికి తలొగ్గి ఏమి చేయలేని పిరికివాళ్ళు, నిస్సాయులు ఉంటారు.

         ఇగా ఆ రాజు అహంకారంతో ఊగిపోతూ, సేనలను సన్నద్ధం చేసి, తన బాణాలను, విల్లు ను తీసుకోని బయలుదేరి, గంధమాదన పర్వతం చేరుకొన్నాడు.

Pride is devastating, Ahankaram


         ప్రశాంతంగా ఉన్న వనంలో నర నారాయణులు తపస్సు చేసుకుంటున్నారు. వారిని చూస్తూనే తొడగొట్టి యుద్దానికి పిలిచి, నవ్వుతూ కోరమీసం మెలితిప్పాడు. 

        నర నారాయణులు తమ ఆశ్రమానికి వచ్చిన మహారాజుకి అతిథి సత్కారాలు జరుపుతుంటే! అవన్నీ అనవసరం, ముందు యుద్ధం, యుద్ధం అని అట్టహాసం చేసాడు. 

        అప్పుడు ఆ నర నారాయణులు...  ఎవరితోనూ సంబంధం లేకుండా కళ్ళుమూసుకొని ఈ ప్రశాంత ప్రదేశంలో తపస్సు చేసుకునే మునులం. మాతో యుద్ధం చేయాలనే కోరిక ఎందుకు కలిగింది మీకు అని అన్నారు. 
అయినా ఆ మహారాజు.. వినకుండా యుద్ధం చెయ్యక తప్పదూ అంటూనే... బాణం ఎక్కుబెట్టాడు. 

         అది చూసిన నరుడు నవ్వుతూ ఒక దర్భపుల్లతీసి. ఇదిగో ఈ గడ్డి పరక నీ సేనను అడ్డుకుంటుంది అని వదిలాడు.

        ఆ రాజు బాణవర్షం కురిపించాడు. ఆ గడ్డి పరక అన్ని బాణాలనూ ముక్కలు ముక్కలు చేసింది. అంతేకాక రాజు సేనలోని వారందరీ ముక్కులను, చెవులను ఖండించింది, దానితో ఆ రాజు సేన కేకలతో పరుగెత్తడం మొదలెట్టారు. దానితో రాజుకీ తల తిరిగింది. తన సైన్యం పారిపోతూంటే రాజుకి గుండె జారింది...

         నర నారాయణుల శక్తి ముందు తన బలం ఎందుకు పనికిరాదని తెలుసుకొని, అంతటి శక్తి కల్గిన ఈ వీరులను ఓడించడానికి వచ్చిన తన అహంకారానికి సిగ్గుపడి తన ఆయుధాలన్నీ కిందపెట్టి, తలవంచి నర నారాయణుల పాదాల మీద పడి ...

         ఆర్యా ! నన్ను క్షమించి అనుగ్రహించండి. నా గర్వానికి ప్రాయశ్చితం అయింది, అని ధీనంగా ప్రార్ధించాడు. అప్పుడు వారు నవ్వుతూ ...

మహారాజా!

         సిరిసంపదలు కలిగినవారు పేద ప్రజలకు దాన ధర్మాలు చేసి గొప్పవారు కావాలి. అలాగే బలపరాక్రమాలు ఉన్నవారు దుర్మార్గుల బారినుండి సజ్జనులను రక్షించడానికి తమ శక్తిని వినియోగించాలి అంతేగాని, అహంకారంతో తిరగరాదు. ఇరుగు పొరుగులకు ఉపకారం చేయని వాడి జన్మం వ్యర్థం అని అన్నారు. 

        మహారాజు వారి భోధనవిని , ఆనాటి నుంచి అహంకారం విడిచి, అందరి శ్రేయస్సు దృష్టిలో ఉంచుకొని తన సంపదలను బీదలకు దానం చేస్తూ, తన బలంతో దుర్మార్గులనూ, క్రూరులనూ శిక్షించి, న్యాయమార్గాన సజ్జన సేవచేసి పేరు ప్రఖ్యాతలు పొందాడు.

కనుక, దుర్యోధనా!

          అహంకారం, బలగర్వం ఎప్పుడు పనికిరావు. అవి ఎవరికీ ఉంటాయో వారినే నాశనం చేస్తాయి అని అన్నాడు పరశురాముడు.

Pride is devastating, Ahankaram


         చూశారా! ఈ అహంకారం వల్ల మహాభారతం జరిగింది. ఎవరు నష్టపోయారు... ఒక్క అహంకారం కలిగిన వాళ్లే  కాకుండా వారి వంశం, వారితో పోరాడిన వారు కూడా కొంత నష్టపోయారు. అంటే ఈ అహంకారం ఎవరితో ఉందొ వారితో పాటు ఆ అహంకారితో పోరాడే ఎదుటివారిలో కూడా మనఃశాంతిని హరిస్తుంది. 

          దురదృష్టకరమైన విషయమేమిటంటే దాని పర్యవసానం తెలుస్తుంటే కూడా... దాన్ని గమనిస్తూకూడా ఆ అహంకారాన్ని అదుపులో పెట్టుకోకుండా తిరిగి వారు ఆ అహంకారాన్ని ఆత్మగౌరవంగా సర్దిజెబుతూ.... జరిగే అనర్ధాన్ని పూర్తిగా జరగనిస్తారు.

Pride is devastating, Ahankaram


         అలాకాకుండా.. మన ఆలోచనల్ని అదుపులో పెట్టుకొని ఆ అహంకారాన్ని వంచి చిన్న చిన్న సర్దుబాట్లతో ఆత్మగౌరవంగా మలచుకొంటే జీవితం సుఖమయం అవుతుంది. దానితో మీ జీవితమే కాదు చుట్టూ ఉన్న వాళ్లతో పాటు ప్రపంచమే శాంతియుతంగా ఉంటుంది. 

         కావున ఆ అహంకారాన్ని దరిచేరనీయకుండా అందరు సౌఖ్యంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.

ఈ కథ యొక్క వీడియో చూడండి ... 




మరిన్ని వీడియోల కోసం KUSUMA Creations Youtube Channel ను Subscribe చేసుకోండి. 

KUSUMA Creations YouTube channel is a part of Bharatsahajavaani.

KUSUMA Creations YouTube channel is an online Bharat Sahaja Vaani of Dhamma Marg education platform, specialized in what is the dharma, Spiritual Gurus introduction, Spiritual right path and Health tips  

       

 ఈ వీడియో మీకు నచ్చినదని భావిస్తూ... 


భవతు సర్వ మంగళం



కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి